Balakrishna: నన్ను చూసుకునే నాకింత పొగరు... విజయం ముందు వాయిదా ఆఫ్ట్రాల్ - బాలకృష్ణ
Akhanda 2 Thaandavam: 'అఖండ 2 తాండవం' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పొగరు అని వచ్చిన కామెంట్స్ మీద స్పందించారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పొగరు అని చేసే కామెంట్స్ మీద 'అఖండ 2 తాండవం' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో స్పందించారు. ఇంతకీ, ఆయన ఏం అన్నారంటే?
ఎవరిని చూసుకుని ఇంత పొగరు?
''ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు - అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు ఇంత పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. తనది పొగరు కాదు అని, అది ఎక్కడ నుంచి వస్తోంది తనకు తెలియదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'అఖండ' నుంచి 'అఖండ 2 తాండవం' వరకు... వరుసగా తాను నటించిన ఐదు సినిమాలు విజయం సాధించడం తనకు చాలా గర్వంగా ఉందని బాలయ్య చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''అఖండ 2' తర్వాత రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. కానీ, సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి సరికొత్త చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. చరిత్ర రాయాలన్నా మేమే. చరిత్రను తిరిగి రాయాలన్నా మేమే'' అని బాలకృష్ణ చెప్పారు.
Also Read: ఢిల్లీలో 'అఖండ 2 తాండవం' చూడబోతున్న మోడీ... దర్శకుడు బోయపాటి సంచలన ప్రకటన
తనకు వృత్తి దైవం అని, ఆ వృత్తి 'అఖండ 2 తాండవం' సినిమాలో తన పాత్ర అని, పాత్ర చేయడం అంటే పరకాయ ప్రవేశం వంటిదని, అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి మాత్రమే సాధ్యపడిందని బాలకృష్ణ వివరించారు.
విజయం ముందు అది ఆఫ్ట్రాల్!
ఇంకా 'అఖండ 2' భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ... ''ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా, విజయవంతంగా ప్రదర్శింబడుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెబుతున్నారు. ఇది కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమా కాదు... దేశ గొప్పతనం గురించి చెప్పిన సినిమా. 'అఖండ' సరిగ్గా కోవిడ్ సమయంలో విడుదలైంది. థియేటర్లకు ఆడియన్స్ వస్తారా? లేదా?అని మీమాంస ఉండేది. అటువంటి సమయంలో భగవంతునిపై భారం వేసి ఆ సినిమా విడుదల చేశాం. అది అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో మిగతా నిర్మాతలకు ధైర్యం వచ్చి సినిమాలను విడుదల చేయడం మొదలు పెట్టారు. 'అఖండ'లో దేవుడు మనిషిలో ఉన్నాడని చెప్పాం. ఇందులో మనిషే దేవుడు అయితే ఏమవుతుందని చెప్పాం. సకుటుంబం సపరివార సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. సనాతన ధర్మ పరాక్రమం ఏమిటో చూపించిన సినిమా 'అఖండ 2 తాండవం'. సత్యం మాట్లాడాలి, ధర్మం దారిలో నడవాలి. అలా కాకుండా అన్యాయం జరిగితే? ఎదురు తిరిగి పోరాడాలని చాటి చెప్పిన సినిమా 'అఖండ 2'. సినిమా ఎప్పుడు వచ్చిందనేది కాదు... ఆ సినిమా ప్రభావం ప్రేక్షకులపై ఎంత ఉందనేది ముఖ్యం. సినిమా విడుదల కావడానికి దిల్ రాజు, మ్యాంగో రామ్, శ్రీధర్, డాక్టర్ సురేందర్ పడిన శ్రమకు వాళ్ళకు థాంక్స్. అది (విడుదల ఆలస్యం కావడం) దేవుడు పెట్టిన పరీక్షగా భావిస్తాను. ప్రేక్షకులు ఇచ్చిన విజయం ముందు అదంతా ఆఫ్ట్రాల్'' అని అన్నారు.





















