Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
Dhoom Dhaam Movie Release Date: పాన్ ఇండియా అంటూ తెలుగు సినిమా పరుగులు తీస్తున్న సమయంలో తెలుగు చిన్న హీరోలకు మాత్రం థియేటర్ల కష్టాలు ఎదురవుతున్నాయి.
టాలీవుడ్ లో ఇప్పటిదాకా తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వరు అనే టాక్ నడిచేది. అలాగే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు అనే విమర్శలు కూడా వినిపించేవి. తాజాగా మరో కొత్త వివాదం టాలీవుడ్ ఖాతాలో పడింది. తెలుగు సినిమాల కంటే ఇతర భాషల సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు అంటూ పలువురు యంగ్ స్టార్స్ తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. నిన్నటికి నిన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాకు థియేటర్లు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తే, తాజాగా చేతన్ కృష్ణ అనే మరో టాలీవుడ్ హీరో తెలుగు సినిమాల కంటే ఇతర భాషల సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
'క' మూవీ విషయంలో కిరణ్ అబ్బవరం ఇలా...
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'క'. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. 'క' రిలీజ్ టైం లో తన సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వలేదని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. ఇక తమిళనాడులో అయితే అసలు తెలుగు షోలు వేయడానికి స్క్రీన్లే ఇవ్వలేదని చెప్పారాయన. వాళ్ళు మొహమాటం లేకుండా మన హీరోలకు థియేటర్లు ఇవ్వకున్నా, తెలుగు వాళ్ళు మాత్రం అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. దీంతో ఎగ్జిబిటర్లు కూడా థియేటర్లను అన్ని భాషల సినిమాలకు కేటాయించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇలా ఇతర భాషల సినిమాలకు న్యాయం చేయాలనుకుని తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. తాజాగా ఇదే విషయంపై మరో యంగ్ హీరో చేతన్ కృష్ణ స్పందించారు.
Hero #ChetanMaddineni Expresses his pain about allocation of theatres for #DhoomDhaam Movie.#DhoomDhaamOnNov8 pic.twitter.com/PSoLNH1U2X
— Sai Satish (@PROSaiSatish) November 5, 2024
చేతన్ కృష్ణ కామెంట్స్...
చేతన్ కృష్ణ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'ధూమ్ ధాం'. సాయి కిషోర్ మచ్చ దర్శకత్వంలో ఫ్రైడే ఫ్రేమ్ బాక్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రామ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. స్టార్ రైటర్ గోపి మోహన్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. 'ధూమ్ ధాం' మూవీ నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ను లాంచ్ చేసి మూవీ సక్సెస్ ఫుల్ కావాలని విష్ చేశారు. అయితే ఇదే వేదికపై హీరో చేతన్ కృష్ణ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చేతన్ మాట్లాడుతూ "హైదరాబాదులో ప్రస్తుతం థియేటర్లు చాలా టైట్ గా ఉన్నాయి. థియేటర్ల అలాట్మెంట్ జరుగుతున్న టైంలో ఈ థియేటర్ ని ఏదో ఒక మూవీకి ఇవ్వచ్చు అన్నట్టుగా ఒక కొత్త థియేటర్ ఓపెన్ అయింది. అలాంటి టైంలో వేరే భాషకు చెందిన ఒక డబ్బింగ్ మూవీకి ఇచ్చేశారు. నా సినిమాతో పాటు తెలుగులో ఓ డీసెంట్ స్టార్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అలాగే మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలా మన భాషకు సంబంధించిన ఏ సినిమాకు థియేటర్ ఇచ్చినా నేను అంతగా హర్ట్ అయ్యేవాడిని కాదు. కానీ అచ్చ తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్దగా స్టార్ కాస్ట్ లేని ఆ సినిమాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి ఒక వారం గడిచిపోతుంది. అయినప్పటికీ ఆ మూవీకి థియేటర్ ఇచ్చారు అనేది బాధ, భయం... ఎనిమిదేళ్లు ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యి ఇక్కడదాకా వస్తే ఇలా జరగడం బాధాకరం" అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు.