Adipurush - Jai Shri Ram Song : సకల మంత్రముల శక్తి సారం, భక్తుల హృదయ నాదం - 'జై శ్రీరామ్', సాంగ్ విన్నారా?
'ఆదిపురుష్' సినిమాలోని 'జై శ్రీరామ్' పాటను ఈ రోజు విడుదల చేశారు.
''సకల మంత్రముల శక్తి సారం...
సమస్త భక్తుల హృదయ నాదం...
శ్రీరామ నామామృతం అనంతం''
అంటోంది 'ఆదిపురుష్' చిత్ర బృందం!
ప్రభు శ్రీరామ చంద్రుని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ జోడీగా, జానకి అలియాస్ సీత దేవి పాత్రలో కృతి సనన్ నటించారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న త్రీడీలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు సినిమాలో తొలి పాటను విడుదల చేశారు.
'ఎవరు ఎదురు రాగలరు మీ దారికి...
ఎవరికి ఉంది ఆ అధికారం?
పర్వత పాదాలు వణికి కదులుతాయ్...
మీ హుంకారానికి!''
అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులతో పాట మొదలైంది. రావణ లంక మీద యుద్ధానికి బయలుదేరే ముందు వానర సైన్యంలో శ్రీరాముడు స్ఫూర్తి నింపే సన్నివేశంలో సంభాషణ అనుకుంట!
'నీ సాయం సదా మేమున్నాం...
సిద్ధం సర్వ సైన్యం!
సహచరులై పదా వస్తున్నాం...
సఫలం స్వామి కార్యం!
మా బలం ఏదంటే...
నీపై నమ్మకమే!
తలపున నువ్వుంటే...
సకలం మంగళమే!
మహిమాన్విత మంత్రం నీ నామం''
అంటూ 'జై శ్రీరామ్' సాంగ్ సాగింది. ఈ పాటకు తెలుగులో సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... అజయ్ - అతుల్ సంగీతం అందించారు.
Also Read : హిందీలో 'మల్లేశం' దర్శకుడు '8 ఎఎం మెట్రో' రివ్యూ... మంచి ఫిల్టర్ కాఫీ తాగిన అనుభూతి
ఆల్రెడీ విడుదలైన 'ఆదిపురుష్' ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. మర్యాదా పురుషోత్తముడు అయిన రాముడు, మర్యాదకు విరుద్ధమైనది ఏదీ చేయలేదని, కనుసైగ చేస్తే పోరాటం చేసే సమస్త సైన్యం ఉన్నప్పటికీ... సీతాదేవి ప్రాణం కంటే మర్యాదకు శ్రీరామచంద్రమూర్తి ఎక్కువ విలువ ఇచ్చారని 'ఆదిపురుష్' ట్రైలర్ ద్వారా దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. వానర సైన్యాన్ని వెంట బెట్టుకుని సీత కోసం ఆయన చేసిన యుద్ధాన్ని కూడా చూపించారు.
Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?
శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు... అన్ని పాత్రలకూ ట్రైలర్ లో సమ ప్రాధాన్యం లభించింది. 'రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనుస్సు విరిచాడు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి' అని సీతా దేవి చెప్పిన డైలాగ్... తన కోసం భర్త ఏదైనా చేస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.
'నా కోసం పోరాడకు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అహకారం రొమ్ము చీల్చి... ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అని శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్ వింటుంటే... అభిమానులకు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. లంకేశుడు రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ట్రైలర్ చివరలో కనిపించినా... క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
'ఆదిపురుష్'లో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.