Adipurush Movie Release: ‘రామాయణం’ నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు చిత్రాలివే - 'ఆదిపురుష్' ప్రత్యేకత ఇదే!
రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇప్పటి వరకూ తెలుగులో అనేక చిత్రాలు వచ్చాయి. నేడు 'ఆదిపురుష్' విడుదల నేపథ్యంలో ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనవీ తీరని మహాకావ్యం 'రామాయణం'. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఆధారంగా వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు, సీరియల్స్ రూపొందాయి. తెలుగులోనూ ఇప్పటికే అనేక చిత్రాలు తెరకెక్కాయి. కొన్ని సినిమాల్లో మొత్తం రామాయణం గాథను చూపిస్తే, మరికొన్ని చిత్రాల్లో మాత్రం కొన్ని కీలక ఘట్టాలను తెర మీద ఆవిష్కరించారు. ఈరోజు 'ఆదిపురుష్' విడుదల నేపథ్యంలో ఆ సినిమాలేంటే ఇప్పుడు తెలుసుకుందాం.
సంపూర్ణ రామాయణం (1958)
తెలుగులో రామాయణం నేపథ్యంలో రూపొందిన మొదటి చిత్రం 'సంపూర్ణ రామాయణం'. దర్శకుడు కె. సోము ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాముడిగా ఎన్టీ రామారావు, సీత పాత్రలో పద్మిని నటించారు. మూడున్నర గంటల నిడివితో, శ్రీరాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకూ అన్ని ప్రధాన ఘట్టాలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చూపించారు. రాముడు అంటే రామారావు అని తెలుగు సినీ అభిమానులు భావించడానికి కారణమైన సినిమా ఇదే.
సీతారామ కళ్యాణం (1961)
రామాయణం ఆధారంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో రాముడు - సీతాదేవిల పరిణయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో గీతాంజలి, హరనాథ్ జంట సీతా రాములుగా కనిపించగా.. రావణాసురుడిగా రామారావు నటించారు. ఇప్పటికీ పెళ్ళి వేడుకలలో పాడుకునే 'శ్రీ సీతారాముల కల్యాణం చూద్దం రారండి' అనే పాట ఈ చిత్రంలోనిదే.
లవకుశ (1963)
సి.పుల్లయ్య, సి.ఎస్.రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ - అంజలీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'లవకుశ'. శ్రీ రాముడి పట్టాభిషేకం తర్వాత, సీతమ్మ కష్టాలను తెర మీద చూపించిన తొలి రామాయణ చిత్రమిది. అంతేకాదు తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ కలర్ సినిమా కూడా కావడం విశేషం.
సంపూర్ణ రామాయణం (1972)
బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ సీతా రాములుగా నటించిన చిత్రం 'సంపూర్ణ రామాయణం'. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండను మినహాయించి, మిగిలిన ఆరు కాండలను ఈ సినిమాలో చూపించారు.
సీతా కళ్యాణం (1976)
బాపు దర్శకత్వంలోనే సీతారాముల పరిణయాన్ని తెర మీద ఆవిష్కరించిన చిత్రం ‘సీతా కల్యాణం’. ఇందులో రవికుమార్, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు.
శ్రీరామ పట్టాభిషేకం (1978)
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘శ్రీరామ పట్టాభిషేకం’. ఎన్టీఆర్ ఈ సినిమాలో రాముడు, రావణాసురుడి పాత్రల్లో నటించారు. సీత పాత్రలో సంగీత కనిపించారు. రామాయణంలోని అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను ఈ సినిమాలో చూపించారు.
బాల రామాయణం (1997)
జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామాయణం’. పూర్తిస్థాయిలో బాల నటీనటులతో తెరకెక్కించడం ఈ సినిమా ప్రత్యేకత. సీతారాముల జననం, పరిణయం, వనవాసం, సీతాపహరణం, రాముడి పట్టాభిషేకం వంటి అన్ని ప్రధాన ఘట్టాలను ఈ సినిమాలో చూడొచ్చు.
శ్రీరామ రాజ్యం (2011)
నందమూరి బాలకృష్ణ, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీరామ రాజ్యం. బాపు-రమణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘లవకుశ’ మాదిరిగానే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత పరిణామాలను చూపించారు.
ఆదిపురుష్ (2023)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈరోజు (జూన్ 16) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలతో పాటుగా పలు భారతీయ భాషల్లో, 3డీ & ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజయింది. రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందిన ఈ పౌరాణిక చిత్రంలో శ్రీరాఘవ పాత్రలో ప్రభాస్ కనిపించారు. జానకిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. రావణుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించారు. మోషన్ క్యాప్చర్ పిక్చర్ టెక్నాలజీతో తెరకెక్కించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇందులో తొలిసారిగా రాముడి పాత్రను మీసకట్టుతో చూపించారు. అలానే మిగిలిన ప్రధాన పాత్రలను కూడా కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
'ఆదిపురుష్' ఈ తరం వారికి రామాయణాన్ని మరింత చేరువ చేస్తుందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సినిమా.. రామాయణ గాథను వరల్డ్ వైడ్ గా చాటిచెప్తుందని ఆశిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మైథలాజికల్ డ్రామా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.