Adikeshava : వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమాపై వరల్డ్ కప్ ఎఫెక్ట్ - దీపావళి నుంచి వెనక్కి వెళ్లిన 'ఆదికేశవ'
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా 'ఆదికేశవ'. దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఇప్పుడు ఆ తేదీ నుంచి సినిమా వెనక్కి వెళ్ళింది.
Adikeshava Release On Nov 24th : మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఆదికేశవ'. ఆయన జోడీగా క్రేజీ కథానాయిక శ్రీ లీల నటించిన చిత్రమిది. దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే... ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. వెనక్కి వెళ్ళింది. కారణం ఏమిటంటే?
'ఆదికేశవ'పై వరల్డ్ కప్ ఎఫెక్ట్!
భారతీయులలో ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ బలంగా ఉంది. ఆల్రెడీ టీం ఇండియా సెమీ ఫైనల్స్ లిస్టులోకి వెళ్ళింది. ఆరు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి అందరి చేత హాట్ ఫేవరేట్ అనిపించుకుంది. నవంబర్ 12న ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంది. నవంబర్ 15, 16వ తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. అందువల్ల, తమ 'ఆదికేశవ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
వరల్డ్ కప్ మ్యాచులు అన్నీ పూర్తి అయిన తర్వాత 'ఆదికేశవ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు నాగవంశీ వివరించారు. అదీ సంగతి! ఇప్పటికే 'ఆదికేశవ' విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడినప్పటికీ... రెండు వారాల తర్వాత విడుదలకు రెడీ అయ్యింది.
Also Read : ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ - నయా అతిలోక సుందరి!
'ఆదికేశవ' చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కించాయి. ఆల్రెడీ విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల మీద తీసిన 'లీలమ్మో...' పాటకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : 'కీడా కోలా' ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది - బ్రహ్మి, తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే?
వైష్ణవ్ తేజ్, శ్రీ లీల తొలిసారి జంటగా నటించిన చిత్రమిది. దీనిని యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఆయన విలన్ రోల్ చేశారు. 'ఇంత తవ్వేశారు! ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా!' - 'ఆదికేశవ' ఫస్ట్ గ్లింప్స్ ప్రారంభంలో వినిపించిన డైలాగ్! ఆ మాట వినిపించే సమయంలో స్క్రీన్ మీద చూస్తే... గుడి వెనుక అంతా తవ్వేసిన దృశ్యం! గుడిలో శివ లింగానికి హారతి ఇస్తున్న పూజారి! ఆ తర్వాత దృశ్యాలు చూస్తే... కథ ఏమిటి? అనేది చాలా క్లారిటీగా అర్థం అయిపోతుంది.
గుడికి రక్షకుడిగా రుద్ర కాళేశ్వర్!
'ఆదికేశవ' సినిమాలో కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి. మైనింగ్ చేసే కొందరు గుడి వెనుక భాగం అంతా తవ్వేస్తారు. ఆ తర్వాత గుడిని కూడా తవ్వేయాలని వస్తారు. అప్పుడు వాళ్ళను హీరో ఎలా అడ్డుకున్నాడు? ఆ గుడికి రక్షకుడిగా ఎలా నిలబడ్డాడు? అనేది కథాంశంగా తెలుస్తోంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మాస్ ప్రేక్షకులకు చేరువ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.