Poonam Kaur On Bilkis Bano Case : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?
గుజరాత్‌లోని బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేయడంపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై గళం విప్పే కథానాయికలలో పూనమ్ కౌర్ ఒకరు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబాన్ని అత్యంత పాశవికంగా చంపేసిన దోషులను విడుదల చేయడంపై ఆమె ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరీ బిల్కిస్ బానో?
పూనమ్ కౌర్ ఎందుకు స్పందించారు? ఏమని స్పందించారు? అనేది చెప్పే ముందు బిల్కిస్ బానో గురించి చెప్పాలి. ఆమె గురించి చెప్పాలంటే... 11 ఏళ్ళు వెనక్కి, 2002కు వెళ్ళాలి. అప్పుడు గుజరాత్‌లోని బిల్కిస్ బానో అనే ఐదు నెలల గర్భిణీపై కొంతమంది అత్యాచారానికి పాల్పడ్డారు. బానో మూడున్నరేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత దారుణంగా చంపేశారు. అందులో 11 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. వాళ్ళందర్నీ సోమవారం విడుదల చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని పక్కన పెట్టి... 1992 నాటి రెమిషన్ చట్టం ప్రకారం ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.
మోడీని విమర్శించిన కేటీఆర్
బిల్కిస్ బానో హత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. మహిళలను గౌరవించాలంటూ మాటలు చెప్పే మీరు, చిత్తశుద్ధి ఉంటే... బిల్కిస్ బానో దోషులను విడుదల చేసిన ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఈ కేసుపై పూనమ్ కౌర్ స్పందించారు.
మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారా?
బిల్కిస్ బానో దోషులను విడుదల చేయడంపై స్పందించే ముందు... ఢిల్లీలోని నిర్భయ, తెలంగాణలో దిశ హత్యాచార ఘటన, ఇటీవల రేప్ కేసులో మంత్రి కుమారుడిని విడుదల చేయడాన్ని పూనమ్ కౌర్ గుర్తు చేశారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ చేసిన కృషిని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో ఆమె ఒక లేఖ విడుదల చేశారు.
''దేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం, దేశంలో మహిళలను గౌరవించే విధానంపై ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఒక అభిప్రాయం ఉంది. దేవి అవతారం నుంచి చాలా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులను చాలా మందికి తమ రాజకీయ అవకాశాలుగా మలుచుకుంటున్నారు. నిర్భయ కేసు విషయంలో షీలా దీక్షిత్, విదేశాల్లో ప్రమాదంలో ఉన్న వారిని వెనక్కి తీసుకొచ్చిన సుష్మా స్వరాజ్ వంటి గౌరవించదగ్గ నేతలు ఉన్నారు. మీ పదవిని, అధికారాన్ని ఉపయోగిస్తున్నారా? లేదా? అనేది ప్రశ్న'' అని పూనమ్ కౌర్ లేఖలో పేర్కొన్నారు.
రేపిస్టులు క్షమాభిక్షకు అర్హులు కాదని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రకటనను పూనమ్ కౌర్ గుర్తు చేశారు. సేఫ్ సిటీ హైదరాబాద్‌లో హత్యాచార ఘటన జరిగినప్పుడు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యిందని... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆమె అన్నారు. ఆ తర్వాత నిర్భయ కేసుపై ఒత్తిడి పెరిగిందని, పలు వాయిదాల తర్వాత పాక్షిక న్యాయం జరిగిందని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించారు.
ఆశ్చర్యకరంగా గుజరాత్ ప్రజల స్పందన
బిల్కిస్ బానో కేసు విషయంలో గుజరాత్ ప్రజల స్పందన తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. దోషులకు కొందరు తిలకం పెట్టడంతో పాటు వాళ్ళకు ప్రసాదాలు ఇవ్వడం, దోషులు ఆ ప్రసాదాలు తింటున్న వీడియోలు కొన్నిటిని తాను చూశానని ఆమె తెలిపారు. ''రేపిస్టులకు క్షమాభిక్ష లేదనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు చెబుతారు?'' అని పూనమ్ ప్రశ్నించారు.
పూనమ్ కౌర్ ఇంకా మాట్లాడుతూ ''ప్రశాంతంగా జీవించలేని మహిళల పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. గుజరాత్ ప్రజలు ఒక స్టాండ్ తీసుకుని, సమాజంలోకి స్వేచ్ఛగా వదిలేసిన ఈ దోషులను బహిష్కరించాలని కోరుకుంటున్నాను. మృగాళ్లను సామాజిక బహిష్కరణ చేయడం అవసరం'' అని అన్నారు.
ఇటీవల తెలంగాణలో... ఒక కారులో అమ్మాయిని రేప్ చేశారని, ఆ కేసులో నిందితులను బెయిల్ మీద విడుదల చేశారని పూనమ్ కౌర్ అన్నారు. ఆ కేసు నుంచి బిల్కిస్ బానో, సుగాలి ప్రీతి కేసుల వరకూ ప్రజలు సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మరో వార్త వస్తే టీవీ ఛానళ్లలో డిస్కషన్లు తగ్గుతాయని... రాజకీయ నాయకులకు మరో విషయంపై గళం వినిపించే అవకాశం లభిస్తుందని... అయితే, ఇటువంటి మృగాళ్లను బహిష్కరించే అధికారం ప్రజల చేతుల్లో ఉంటుందని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.
Also Read : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు
తెలంగాణలో రేప్ కేసులో నిందింతులను బెయిల్ మీద వదిలేశారని సోషల్ మీడియాలో విడుదల చేసిన లేఖ చివరిలో పేర్కొన్న పూనమ్ కౌర్... అంతకు ముందు కొందరు రాజకీయ అవకాశంగా మలుచుకుంటున్నారని వ్యాఖ్యానించడాన్ని ఏం అనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రభుత్వానికీ ఆమె చురకలు అంటించారా?
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ
View this post on Instagram