Actress Hema: కేవలం సినిమాలనే నమ్ముకుంటే ఇలా ఉండేదాన్ని కాదు - హేమ ఇంటర్వ్యూ వైరల్
Actress Hema: హేమ.. బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికినప్పటి నుండి ప్రేక్షకులు తన గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. తన ఆస్తుల వివరాలను చెప్పిన పాత ఇంటర్వ్యూ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.
Actress Hema About Her Properties: ప్రస్తుతం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించే టాలీవుడ్ అంతటా చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో తన తప్పేం లేదు, తాను అసలు బెంగుళూరు వెళ్లలేదు, హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఆరోపించిన హేమ సైతం డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలింది. దీంతో హేమకు సంబంధించిన పలు పాత ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. అందులోని ఒక ఇంటర్వ్యూలో హేమ.. తన ఆస్తుల వివరాల గురించి చెప్పుకొచ్చింది. అంత ఆస్తి ఉంది కాబట్టే బెంగుళూరు రేవ్ పార్టీ ఎంట్రీ కోసం రూ.5 కోట్లు ఇవ్వగలిగిందని విమర్శిస్తున్నారు ప్రేక్షకులు.
మాకేం లోటు లేదు..
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న హేమ.. చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తోంది. సినిమాల వల్లే ఇది సాధ్యమవుతుందా అని అడగగా.. కేవలం సినిమాలపైనే ఆధారపడి ఉండుంటే తన జీవితం వేరేలాగా ఉండేదంటూ వ్యాఖ్యలు చేసింది. ‘‘నా భర్త కెమెరామ్యాన్, మా అమ్మవాళ్లు కూడా ఉన్నవాళ్లే. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫుల్‌గా నగలు వేసుకొని తిరిగేదాన్ని. ఊరిలో మాకేం లోటు లేదు. కిట్టీ పార్టీలు లాంటివాటితో కూడా సంపాదిస్తున్నాను. కేవలం ఇండస్ట్రీపైనే ఆధారపడి సంపాదించడం కష్టం’’ అని చెప్పుకొచ్చింది హేమ. కాకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా తనకు రూ.150, రూ.200 కోట్ల ఆస్తులు లేవని చెప్తూ నవ్వింది. తను ఉన్నదాంట్లో హ్యాపీగా ఉన్నానని తెలిపింది.
ఆ విషయంలో గొడవలు..
ఇండస్ట్రీలోని కొత్త దర్శకులు చాలావరకు తనకు తెలియదని, అప్పటి దర్శకులతో మాత్రం తను చాలా క్లోజ్‌గా ఉంటానని చెప్పుకొచ్చింది హేమ. తను సెట్‌లో ఉంటే బాగుంటుందని చాలామంది చెప్పారని గుర్తుచేసుకుంది. అంతే కాకుండా తనకు ఎవరితో ఎక్కువశాతం గొడవలు అవ్వవని, ఒకవేళ అయినా అవి ఎందుకు అవుతాయి అనే విషయాన్ని బయటపెట్టింది. ‘‘ఆడవాళ్లకు మేకప్, కాస్ట్యూమ్స్, నగలు అని చాలా ఉంటాయి. మగవాళ్లు జీన్స్, షర్ట్ వేసుకొని వచ్చేస్తారు. వాళ్లకు క్యారవ్యాన్‌లో ముందు రూమ్ ఇస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు వెనక రూమ్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఇద్దరు, ముగ్గురు ఆర్టిస్టులను అదే రూమ్ ఇస్తారు. అలాంటివి నేను నేరుగా అడిగేస్తాను. రెమ్యునరేషన్ విషయంలో కూడా నిజాయితీగా ఉంటాను’’ అని తెలిపింది హేమ.
అలా చేయడం తప్పు..
‘‘నిన్న కాక మొన్న వచ్చిన ఆర్టిస్టులకు క్యారవ్యాన్ ఇస్తున్నారు. సీనియర్లకు ఇవ్వకపోవడం తప్పు కదా.. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులకు కూడా క్యారవ్యాన్ ఇవ్వాలి అనే రూల్ వచ్చింది’’ అంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుల సమస్యల గురించి చెప్పుకొచ్చింది హేమ. ఇక తన క్యారెక్టర్ల గురించి, వాటికోసం తను తీసుకునే జాగ్రత్తల గురించి కూడా తను మాట్లాడింది. ‘‘నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే దానికి సూట్ అయ్యేలా రెడీ అయ్యి వస్తాను. డైరెక్టర్‌కు ఏదైనా నచ్చకపోతే స్పాట్‌లో రెడీ అయిపోతాను. అందుకే దర్శకులకు, నిర్మాతలకు నాతో ఏం సమస్య ఉండదు. ఏదైనా సమస్య ఉంటే నిజాయితీగా అడుగుతాను కాబట్టి మ్యానేజర్లు ఫీల్ అయితే అయ్యిండొచ్చు అని తెలిపింది హేమ.
Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ కేసు - 'మా' అసోసియేషన్ నుంచి హేమ తొలగింపు.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు