Rana on Film Industry: నేను తొమ్మిదేళ్ల క్రితమే చెప్పాను, ఇప్పడు జరుగుతుంది అదే: దగ్గుబాటి రానా
ఎప్పటికైనా ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలసి ఒక్కటిగా పనిచేయాలని తనకు ఎప్పటినుంచో అనిపిస్తుంటుందని అన్నారు రానా. తాను హిందీలో ‘దం మారో దం’ సినిమాలో నటిస్తున్నప్పుడే ఈ ఆలోచన ఉందన్నారు.
టాలీవుడ్ లో దగ్గుబాటి రానా గురించి తెలియని వారుండరు. సినిమాల్లో పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచే వచ్చినా.. రానా తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమా ‘లీడర్’ తోనే ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కెరీర్ ప్రారంభంలోనే హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. ఇటీవల ఆయన స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షో కు హీరో నానితో కలసి హాజరయ్యారు. ఈ సందర్బంగా రానా, నాని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న పాన్ ఇండియా సినిమాలు, అలాగే సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం వంటి అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
నెపోటిజం పై దగ్గుబాటి రానా మాట్లాడుతూ.. తన సినిమా కెరీర్ లో బంధుప్రీతి, అలాగే సొంత టాలెంట్ తో రానించడం రెండూ చూశానని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తాను హీరోగా పరిచయం అయినప్పుడు తాను ఓ నటుడు గానే తెలుసని, అయితే బాలీవుడ్ లో నటించినపుడు తాను ఎవరో కూడా వాళ్లకి తెలియదని చెప్పారు రానా. నిజానికి వారసత్వం అనేది మనల్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికే ఉపయోగపడుతుందని, స్టార్ డమ్ ను తెచ్చిపెట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు.
వారసత్వాన్ని కొనసాగించలేకపోతే కుటుంబానికి అన్యాయం చేసినట్టే..
తన కుటుంబంలో ఆయన తాతయ్య ఊర్లో ఉన్న రైస్ మిల్లు ను అమ్మి చెన్నై వచ్చి వ్యాపారాలు చేసేవారని, అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 45 ఏళ్లుగా సినిమాలు నిర్మించారని అన్నారు. ఆయన తర్వాత తన నాన్న, చిన్నాన్న సినిమా పరిశ్రమలోకి వచ్చి ఆయన వారసత్వాన్ని కొనసాగించారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఒక స్టూడియోను కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పుడు తాను వాళ్ల నుంచి వారసత్వాన్ని తీసుకొని దాన్ని కొనసాగించాలని, అలా చేయలేకపోతే అది తన తప్పే అవుతుందన్నారు. అప్పుడు తన కుటుంబానికి అన్యాయం చేసిన వాడినవుతానని పేర్కొన్నారు. నిజానికి వారసత్వాన్ని కొనసాగించడంలో ఉండే బాధ్యత, బరువు చాలా మందికి తెలియవన్నారు.
నేను తొమ్మిదేళ్ల క్రితమే చెప్పాను..
ఎప్పటికైనా ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలసి ఒక్కటిగా పనిచేయాలని తనకు ఎప్పటినుంచో అనిపిస్తుంటుందని అన్నారు. తాను హిందీలో ‘దం మారో దం’ సినిమాలో నటిస్తున్నప్పుడే ఈ ఆలోచన ఉందన్నారు. ఎప్పటికైనా ఈ ప్రాంతీయ సినిమాలన్ని కలసి పనిచేయాలి అని తొమ్మిదేళ్ల క్రితమే చెప్పానని, కానీ అప్పుడు ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు అదే జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోందని, ముఖ్యంగా తెలుగు సినిమా పేరు పాన్ ఇండియా లెవల్ లో ఎక్కువగా వినిపిస్తోందని అన్నారు. అయినా ఉత్తరాది, దక్షిణాది పరిశ్రమలు అనేది లేదని అంతా ఒక్కటైపోయాం అని చెప్పుకొచ్చారు.
వాళ్లే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది..
నెపోటిజం పై హీరో నాని కూడా స్పందించారు. తన దృష్టిలో నెపోటిజం అనే దాన్ని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు అంతగా ఏం పట్టించుకోవట్లేదని అన్నారు. ఏదైనా ఉంటే సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. ఉదాహరణకు.. నాని మొదటి సినిమాను లక్షమంది చూశారనుకోండి చరణ్ మొదటి సినిమాని కోటి మంది చూస్తున్నారు. ఆ లెక్కన చూసిన వాళ్లే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది అని అన్నారు. సినిమాలో నెపోటిజం అనేది ఉండదని, ప్రేక్షకులకు ఏం కావాలో వాళ్లు అది ఇస్తున్నారంతే అని నాని అన్నారు.
Read Also: ‘సలార్’కు శృతిహాసన్ గుడ్ బై - ఆధ్య ఎమోషనల్ పోస్టు