Dolly Sohi: నిన్న చెల్లి, ఈ రోజు అక్క - గంటల వ్యవధిలో ఇద్దరు నటీమణులు మృతి, హిందీ పరిశ్రమలో విషాదం
హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు నటీమణులు చనిపోయారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
Actor Dolly Sohi Dies Due To Cancer: సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. గత కొద్ది రోజుల్లోనే పలు సినిమా పరిశ్రమలకు చెందిన నటీనటులు, పలు కారణాలతో కన్నుమూశారు. ఇప్పుడు ఇద్దరు అక్కాచెల్లెళ్లు అయిన నటీమణులు గంటల వ్యవధిలో మృతి చెందారు. వీరి మరణంతో హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
క్యాన్సర్ తో డాలీ, జాండిస్ తో అమన్ మృతి
నార్త్ లో టీవీ నటి డాలీ సోహి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. గత కొంతకాలంగా సర్వికల్ క్యాన్సర్ తో ఆమె బాధపడుతోంది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం మృతి చెందింది. అంతకు కొద్ది గంటల ముందే, ఆమె సోదరి, నటి అమన్ దీప్ జాండిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ మరణించింది. గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డాలీ, అమన్ దీప్ మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. “డాలీ, అమన్ దీప్ ఇద్దరూ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అమన్ దీప్ గురువారం సాయంత్రం చనిపోయింది. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది” అని కుటుంబ సభ్యలు తెలిపారు.
చనిపోయే ముందు కూడా యాక్టివ్ గా ఉన్న డాలీ, అమన్
హిందీ టెలివిజన్ రంగంలో డాలీ నటిగా రాణిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాలీ చివరి సారి గతేడాదిలో కీమోథెరపీ చేయించుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. “పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా సులభం అవుతుంది. క్యాన్సర్ వచ్చిందని బాధపడుతూ ఉండాలో? ధైర్యంగా ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో? మన చేతుల్లోనే ఉంటుంది” అని ఆ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అక్కా చెల్లెళ్లు కలిసి ఇన్ స్టా రీల్స్ కూడా చేశారు. డాలీ ధైర్యాన్ని చూసి, తప్పకుండా క్యాన్సర్ ను జయిస్తుందని అభిమానులు భావించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ, ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ మృత్యు ఒడిలోకి చేరింది.
హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం
ఒకే కుటుంబలో గంటల వ్యవధిలో ఇద్దరు నటీమణులు చనిపోవడంతో హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఇద్దరి ఆత్మకు శాంతి చేకూరలని నటీనటులు ఆకాంక్షించారు. వారికి కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు. అటు వారి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. డాలీ 'దేవోన్ కా దేవ్ మహాదేవ్', 'కుంకుమ్ భాగ్య్', 'హిట్లర్ దీదీ', 'మేరీ ఆషికీ తుమ్ సే హీ', 'పరిణితి', 'సింధూర్ కీ కీమత్' లాంటి సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.