Bigg Boss Season 7 Latest Promo: అమర్‌కు ఏం చెప్పినా వినడు, మొదటి నుంచి అంతే - నాగార్జున ముందే శివాజీ ఆరోపణలు
బిగ్ బాస్ సీజన్ 7లోని అయిదో వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ విషయంపై నాగార్జున కంటెస్టెంట్స్‌పై సీరియస్ అవుతూ.. ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే శివాజీ.. అమర్‌పై పలు ఆరోపణలు చేశాడు.
బిగ్ బాస్ సీజన్ 7లోని ఈ వారమంతా పూర్తిగా కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్స్ చురుగ్గా, అతి తెలివితో గేమ్స్ ఆడారు. రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అన్ని అడ్డంకులను దాటి బిగ్ బాస్ సీజన్ 7కు మొదటి కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా జంటలుగా విడిపోయి గేమ్స్ ఆడారు. ప్రతీ రౌండ్‌లో సంచాలకులు చేసిన తప్పులు కొన్ని ఉంటే.. దానికి మించిన తప్పులను కంటెస్టెంట్స్ కూడా చేశారు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో వచ్చిన నాగార్జున.. వారు చేసిన తప్పులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేసిన తప్పులను వీడియోల ద్వారా చూపించారు. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
‘‘గత వారంలో మీకు జరిగిన అన్యాయాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి మీ ఉద్దేశ్యం?’’ అని నాగార్జున.. కంటెస్టెంట్స్‌ను అడగారు. ఇందులో ముందుగా కెప్టెన్సీ టాస్క్ విషయంలో శోభా శెట్టితో నాగ్ మాట్లాడారు. ‘‘నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం వల్ల నీ బడ్డీ నష్టపోయింది.’’ అని శోభా చేసిన తప్పును గుర్తుచేశారు. నాగార్జున అలా మాట్లాడుతుండగా.. శోభా బాధపడింది. అది చూసిన ప్రియాంక.. తనను ఓదార్చబోయింది. ఇది గమనించిన నాగార్జున.. ‘‘ప్రియాంక నన్ను నిజం చెప్పనివ్వు. నీకు అసలు సమస్య లేదు అనుకుంటే వదిలేస్తాను’’ అన్నారు. దానికి ప్రియాంక ‘‘ప్లీజ్ వద్దు సార్’’ అంటూ నాగ్‌ను రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ‘‘ఈ పాయింట్ దగ్గరే నేను ఫైట్ చేశాను. ఒక పాయింట్ దగ్గరే అలా జరిగింది’’ అంటూ తను చేసిన పనిని సమర్థించుకోబోయింది శోభా. అయితే ‘‘ఫైనల్ రిజల్ట్ ఏంటి’’ అని ఎదురుప్రశ్న వేశారు నాగార్జున. ‘‘స్టాండ్ తీసుకోకపోవడం పెద్ద తప్పు. మేమందరం చూస్తున్నాం’’ అని శోభాను హెచ్చరించారు.
శోభా శెట్టి, ప్రియాంక తర్వాత గౌతమ్, శుభశ్రీలతో కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడారు నాగార్జున. ముఖ్యంగా లెటర్స్ టాస్క్‌లో గౌతమ్ ప్రవర్తనను తప్పుబట్టారు. ‘‘నీతో మాట్లాడను అని చెప్పడం ఏమార్చడమా లేకపోతే ఏంటది’’ అని గౌతమ్‌ను ప్రశ్నించారు. గౌతమ్‌ను అడిగిన ప్రశ్నకు శుభశ్రీ సమాధానమిచ్చింది. ‘‘నావైపు నుంచి నేను ఏదైనా చెప్తే.. తను ఒప్పుకోవడానికి సిద్దంగా లేడు’’ అని శుభశ్రీ వాపోయింది. ‘‘అప్పుడు తన ఫీలింగ్‌ను కూడా గౌరవించాలి కదా’’ అంటూ గౌతమ్‌కు చెప్పారు నాగ్. అయితే తన లెటర్ చింపేయాలని తాను ప్రయత్నించానని, కానీ శుభనే ఆపిందని తన తప్పును సమర్థించుకోబోయాడు గౌతమ్. ‘‘చూశాం. స్పందన లేకుండా నువ్వు ఎలా నిలబడ్డావో చూశాం.’’ అంటూ నాగార్జున స్పష్టంగా చెప్పారు.
ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, శివాజీ ఆడిన ఆట గురించి మాట్లాడారు నాగార్జున. ‘‘ఫ్రూట్ నింజా టాస్క్‌లో ప్రశాంత్ ఒకపక్క నుంచి చెప్తూనే ఉన్నాడు. అన్నా తొక్కలేశారు అని. కానీ వదిలేయరా అని ఎలా అంటావు శివాజీ.’’ అని ప్రశ్నించారు నాగ్. దానికి సమాధానంగా.. ‘‘ప్రతీదానికి గొడవలు పెట్టుకోవడం నాతో అవ్వదు సార్. మాస్టర్ తొక్కలు వేసింది నేను చూడలేదు కానీ పక్కన నుంచి తీయడం నేను చూశాను.’’ అని చెప్పాడు శివాజీ. అయితే సంచాలకుడిగా ఉన్న అమర్‌దీప్‌కు చెప్పాలి కదా అని నాగార్జున అన్నారు. ‘‘అసలు అమర్‌కు ఏం చెప్పినా వినడు. వాడికి ఒక నెగిటివ్ ఫీలింగ్. మొదటిరోజు నుంచి అలాగే పెట్టుకున్నాడు.’’ అంటూ అమర్‌దీప్ ముందే ఘాటు వ్యాఖ్యలు చేశాడు శివాజీ.
Also Read: తొక్కలో సంచాలక్ - యావర్, తేజని మెచ్చుకున్న నాగార్జున!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial