Bigg Boss 17: భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్, హౌస్‌లోనే విడాకులు కావాలంటూ లొల్లి
Bigg Boss Season 17: బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్స్‌గా భార్యభర్తలు వెళ్లారు. ఆ భార్యభర్తల మధ్య బిగ్ బాస్ చిచ్చుపెట్టింది. ఏకంగా విడాకులు కావాలి అని స్టేట్‌మెంట్ ఇచ్చేవరకు వచ్చింది.
బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అస్సలు సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఈజీగా చిచ్చుపెట్టగలదు. అలాంటిది భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టడం మేకర్స్‌కు పెద్ద పని కాదు. తాజాగా హిందీ బిగ్ బాస్‌లో అదే జరిగింది. పలువురు కపుల్స్‌ను బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చారు మేకర్స్. అయితే అందులో కొందరు కపుల్స్ అన్యోన్యంగా, బయట ఎలా ఉంటారో.. హౌజ్‌లో కూడా అలాగే ఉన్నా.. కొందరు మాత్రం షోలోని రూల్స్ వల్ల, టాస్కుల వల్ల గొడవపడడం మొదలుపెట్టారు. తాజాగా ఒక కపుల్ అయితే ఒకరిపై ఒకరికి ప్రేమ లేదంటూ వ్యాఖ్యలు చేసుకోవడం మాత్రమే కాకుండా విడాకుల వరకు వెళ్లిపోయారు.
మలుపు తిప్పిన బిగ్ బాస్
ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ వెర్షన్‌లో 17వ సీజన్ నడుస్తోంది. భాషతో సంబంధం లేని ఎంతోమంది బిగ్ బాస్ లవర్స్.. హిందీ బిగ్ బాస్‌ను ఫాలో అవుతుంటారు. అయితే అందులో అందరికంటే ఎక్కువగా వినిపించే కంటెస్టెంట్స్ పేర్లు.. అంకితా లోఖండే, విక్కీ జైన్. ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది అంకితా లోఖండే. అంతే కాకుండా ఆత్మహత్య చేసుకొని మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా కూడా ప్రేక్షకులు తనను ఇప్పటికీ గుర్తుపడతారు. అంకితా.. 2021లో బిజినెస్‌మ్యాన్ విక్కీ జైన్‌ను వివాహం చేసుకుంది. ఈ రెండేళ్లు వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ అప్పుడే వారికి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్‌ను ఒప్పుకోవడంతో వారి జీవితం మరో మలుపు తిరిగింది.
విడాకులు కావాలి
బిగ్ బాస్ 17లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టినప్పటి నుంచి చాలా సందర్భాల్లో అంకితా, విక్కీల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకున్నారు. వారిద్దరి ఒకరిపై ఒకరు ఘోరమైన ఆరోపణలు చేసుకున్నారు, అనరాని మాటలు అనుకున్నారు. తాజాగా మరోసారి అంకితా, విక్కీల మధ్య గొడవ జరిగింది. తమ తోటి కంటెస్టెంట్ అయిన అయేషా ఖాన్.. విక్కీని ప్రేమ, పెళ్లి గురించి తన మాటల్లో చెప్పమని అడిగింది. పెళ్లి తర్వాత భర్త ఎలాంటి కష్టాలు ఎదుర్కుంటాడో సరదాగా చెప్పుకొచ్చాడు విక్కీ. అది అంకితాకు నచ్చలేదు. కోపంలో విక్కీతో విడాకులు కావాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత విక్కీతో కలిసి ఉండాలని లేదని, విడాకులు కావాలని అందరి ముందు చెప్పేసింది. అంకితా ప్రవర్తన చూసి కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
జోకులు వేయడం, చిన్నచూపు చూడడం
ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌లో అంకితా, విక్కీల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అంకితాపై విక్కీ జోకులు వేయడం, తనను చిన్నచూపు చూడడం, టాస్కుల విషయానికొస్తే.. తాను భార్యతో వచ్చానని మర్చిపోయి ఆడడం.. ఇవన్నీ తన పట్ల ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడేలా చేశాయి. ఇక ఏకంగా విడాకులు కావాలని అంకితా స్టేట్‌మెంట్ ఇచ్చే రేంజ్‌లో విక్కీ మాటలు పెరిగిపోయాయి. ఇప్పటికే బిగ్ బాస్ 17లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. దానికోసం విక్కీ తల్లితో పాటు అంకితా తల్లి కూడా వచ్చింది. వారు కూడా బిగ్ బాస్ హౌస్‌లో అంకితా, విక్కీల ప్రవర్తన చూసి భయమేస్తుందని, అందులో నుంచి బయటికి వచ్చేయమని కోరారు.
Also Read: 'డంకీ' ఆడియన్స్ రివ్యూ : షారుఖ్ ఖాతాలో 1000 కోట్ల సినిమానా? అంకుల్స్, ఆంటీస్ కోసమా?