Balakrishna : ముతక పంచె, నల్ల చొక్కా, చుట్ట - 'వీర సింహా రెడ్డి' గెటప్ వెనుక కథ వివరించిన బాలకృష్ణ
'వీర సింహా రెడ్డి'లో ఫ్యాక్షన్ నాయకుడిగా నట సింహం నందమూరి బాలకృష్ణ గెటప్ చాలా మందిని ఆకట్టుకుంది. ఆ గెటప్ వెనుక ఉన్న సీక్రెట్ బాలకృష్ణ ఈ రోజు రివీల్ చేశారు.
'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'చెన్నకేశవరెడ్డి'... ఫ్యాక్షన్ నేపథ్యంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హిట్ సినిమాలు చేశారు. మళ్ళీ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా అనగానే 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) ఎలా ఉంటుంది? అని కొంత మంది అభిమానుల్లో సైతం ఓ సందేహం. ఒక్క లుక్ ఆ సందేహాలకు చెక్ పెట్టేశారు.
నల్ల చొక్కా, ముతక పంచె... 'వీర సింహా రెడ్డి' ఫస్ట్ లుక్ విడుదల అయ్యిందో? లేదో? నందమూరి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల కూడా నచ్చింది. అయితే, ఆ గెటప్ ఎలా ఫైనలైజ్ చేశారు? దానికి వెనుక ఏం జరిగింది? అనేది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో (Balakrishna Interview) బాలకృష్ణ చెప్పారు.
రెండు క్యారెక్టర్లు... మూడు షేడ్స్!
'వీర సింహా రెడ్డి' సినిమాలో రెండు క్యారెక్టర్లు చేసినట్టు బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆ రెండు క్యారెక్టర్లలో టైటిల్ రోల్ తండ్రి క్యారెక్టర్ అని చెప్పేశారు.
ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ ''కథ విన్నప్పుడు నా కళ్ళ ముందు మెదిలేది గెటప్! ఫ్యాక్షన్ లీడర్ రోల్ టైలర్ మేడ్ తరహాలో ఉంటుంది. వైట్ అండ్ వైట్ ఫిక్స్ చేశాం. 'వీర సింహా రెడ్డి'ది తండ్రి పాత్ర. ఆ క్యారెక్టర్ ఎంతో భారాన్ని మోస్తుంది. అందుకని, గెటప్ ఎలా ఉండాలని ఆలోచించా. సాధారణంగా హర్తాళ్, ధర్నాలు చేస్తున్నప్పుడు నల్ల చొక్కాలు వేస్తాం. బాధ కనిపిస్తుందని నల్ల చొక్కా వేశా. ముతక పంచె తీసుకురమ్మని చెప్పాను. షూటింగ్ చేసినన్ని రోజులూ ఆ పంచెకు ఇస్త్రీ కూడా చేయవద్దని చెప్పా. ఫ్యాక్షన్ బాడీ లాంగ్వేజ్, ఎమోషన్ క్యారీ చేస్తున్న ఆ పాత్రలో సాత్వికం కనిపించాలి. అందుకని, ఆ గెటప్. చుట్ట వెనుక కూడా ఓ కథ ఉంది. పొగ వదులుతుంటే... లోపల రగులుతున్న ఆవేశానికి ప్రతీకగా ఉంటుందని, బావుంటుందని యాడ్ చేశాం'' అని చెప్పారు. కొడుకు క్యారెక్టర్ పేరు జయ సింహా రెడ్డి అని చెప్పారు.
బాలయ్య చెప్పడంతోనే బ్లాక్ షర్ట్
దర్శకుడు గోపీచంద్ మలినేని తొలుత 'వీర సింహా రెడ్డి' క్యారెక్టర్ వయసు మళ్ళిన తర్వాత కూడా వైట్ అండ్ వైట్ షర్ట్ డిజైన్ చేశానని చెప్పారు. బాలయ్య బాబు చెప్పడంతో బ్లాక్ షర్ట్ వేశామని, ముందు తాను నల్ల చొక్కా వేయమని అడగలేకపోయానని ఆయన తెలిపారు.
Also Read : దర్శకులకు చిరంజీవి ఇచ్చే కంఫర్ట్ ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తారంటే?
బాలకృష్ణతో షూటింగ్ చేసిన ప్రతి రోజూ తనకు మెమరబుల్ అని, 'వీర సింహా రెడ్డి' సినిమా తీయడం తన డ్రీం కమ్ మూమెంట్ అని గోపీచంద్ మలినేని తెలిపారు. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్పెక్టర్' సినిమాలు చూసి తాను బాలయ్య అభిమాని అయ్యానని, తాను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఊరు వెళ్ళినా ''బాలయ్యతో ఎప్పుడు సినిమా చేస్తావ్?'' అని జనాలు అడిగేవారని చెప్పారు. బాలకృష్ణలో రౌద్ర రసం ఎక్కువ అని చెప్పారు.
శ్రుతీ హాసన్ కథానాయికగా... హానీ రోజ్ మరో నాయికగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.