Balakrishna : విలన్‌కు హీరోయిన్ ఛాన్స్ - బాలకృష్ణ ప్రామిస్
బాలకృష్ణ ఓ అమ్మాయికి ప్రామిస్ చేశారు. తనకు జోడీగా, సినిమాలో కథానాయికగా నటించే అవకాశం ఇస్తానని! ఆ అమ్మాయి ఎవరు? అనేది తెలుసుకోండి.
కొత్త కథానాయికలకు అవకాశం ఇవ్వడానికి ఎప్పుడూ ముందుండే కథానాయకులలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఆయన దర్శక, నిర్మాతల హీరో. తన సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండాలని ఎప్పుడూ పట్టుబట్టిన సందర్భాలు లేవు. ఆయన సినిమాల్లో అప్‌కమింగ్, న్యూ, హిందీ హీరోయిన్లు కూడా కనిపిస్తూ ఉంటారు.
బాలకృష్ణకు జోడీగా వరలక్ష్మి
బాలకృష్ణ తాజా సినిమా 'వీర సింహా రెడ్డి'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ రోల్ చేశారు. సినిమాలో బాలకృష్ణకు చెల్లెలుగా ఆమె నటించారు. అయితే, ఏదో ఒక సినిమా రోజు తనతో కథానాయికగా చేసే అవకాశం ఇస్తానని 'అన్‌స్టాపబుల్ 2'లో ఆమెకు బాలకృష్ణ ప్రామిస్ చేశారు.
''అన్‌స్టాపబుల్ స్టార్టింగులో నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు మన ఇద్దరం హీరో హీరోయిన్లుగా సినిమా చేద్దాం'' అని బాలకృష్ణ అన్నారు. వెంటనే ఆయనకు వరలక్ష్మీ శరత్ కుమార్ హై ఫైవ్ (చేతులు కలిపారు) ఇచ్చారు. 'వీర సింహా రెడ్డి'లో తనకు చెల్లిగా చేశావని, త్వరలో చెలి (ప్రేయసి)గా సినిమా చేద్దామని బాలకృష్ణ ఆమెకు అవకాశం ఇచ్చారు.
''హీరో హీరోయిన్లుగా సినిమా చేసే రోజున సెట్‌కు 'వీర సింహా రెడ్డి' దర్శకుడు గోపీచంద్ మలినేనిని పిలిచి 'నన్ను విలన్ ఎందుకు చేశావ్?' అని పొడిచెయ్'' అని బాలకృష్ణ సరదాగా అడిగారు. అప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ ''నేను రోజూ ఆ పని చేస్తున్నా సార్. అన్‌స్టాపబుల్ షోకి ముందు... ఇప్పుడు కూడా ఆ విషయమై గొడవ పడ్డాను'' అని చెప్పారు. 'క్రాక్' సినిమాతో వరలక్ష్మీ శరత్ కుమార్ అంటే బలమైన లేడీ విలన్ అని అందరూ ఇంప్రెస్ అయ్యేలా గోపీచంద్ మలినేని ఆమెను చూపించారు. 'వీర సింహా రెడ్డి'లో కూడా అంతే! ఆమెకు స్ట్రాంగ్ లేడీ విలన్ రోల్ ఇచ్చారు.
నాగమ్మ నాయకురాలు చెయ్
చారిత్రాత్మక సినిమా చేయాలని ఉందని 'అన్‌స్టాపబుల్ 2'లో బాలకృష్ణ మరోసారి చెప్పారు. ఆయన కొన్ని చారిత్రక చిత్రాలు చేశారు. అయితే, ఇప్పుడు తనకు 'పల్నాటి యుద్ధం' చేయాలని ఉందని తెలిపారు. అంతే కాదు... అందులో నాగమ్మ నాయకురాలు పాత్ర చేయమని వరలక్ష్మీ శరత్ కుమార్ తో అన్నారు. ''ఆణిముత్యం లాంటి ఆర్టిస్ట్. నాగమ్మ నాయకురాలు చేయగల ఆర్టిస్ట్'' అని బాలకృష్ణ చెప్పారు.
మోహన్ బాబులా వరలక్ష్మి
వరలక్ష్మికి బాలకృష్ణ ఓ కాంప్లిమెంట్ ఇచ్చారు. కలెక్షన్ కింగ్, డా. మోహన్ బాబుతో ఆమెను పోల్చారు. వర్సటైల్ ఆర్టిస్ట్ అని చెప్పారు. ''మాకు మోహన్ బాబు గారు ఎలాగో... నువ్వు అలాగ'' అన్నారు.
ఆహాలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్
సంక్రాంతి కానుకగా శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో 'అన్‌స్టాపబుల్ 2'కు 'వీర సింహా రెడ్డి' టీమ్ వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, గోపీచంద్ మలినేని తొలుత వచ్చారు. ఆ తర్వాత సినిమాలో తల్లిగా, వీర సింహా రెడ్డి పాత్రకు జోడీగా నటించిన మలయాళ భామ హానీ రోజ్, నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా సందడి చేశారు.
Also Read : పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?