Balagam - LACA Awards: లాస్ ఏంజెల్స్ అవార్డు వేడుకలో సత్తా చాటిన ‘బలగం‘, రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు
తెలంగాణ పల్లె సంప్రదాయాలను సజీవంగా కళ్లకు చూపించిన చిత్రం ‘బలగం‘. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ లాస్ ఏంజెల్స్ అవార్డు వేడుకలో రెండు అవార్డులను గెల్చుకుంది.
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘బలగం’. మార్చి 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ అలరిస్తోంది. పెద్ద సినిమాలకు దీటుగా ఈ చిత్రం వసూళ్లను రాబడుతోంది. టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సక్సెస్‌ఫుల్ టాక్ థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘బలగం’ చిత్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
తాజాగా ‘బలగం’ చిత్రం అంతర్జాతీయ అవార్డుల వేడుకలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులన మనసులను దోచుకోవడంతో పాటు అవార్డులను సైతం గెల్చుకుంటోంది. చక్కటి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కిస్తే ఆడియెన్స్ తప్పకుండా అండగా నిలుస్తారని ఈ సినిమా నిరూపించింది.
Balagam shines on the global stage! 🤩❤️
— Dil Raju Productions (@DilRajuProdctns) March 30, 2023
Congratulations to our director @VenuYeldandi9 and our cinematographer @dopvenu for winning the prestigious Los Angeles Cinematography Awards. 👏🏻👏🏻
Running successfully in theatres near you🙌@priyadarshi_i @kavyakalyanram pic.twitter.com/gCEhvEXLYR
‘బలగం’ కథేంటంటే?
‘బలగం’ చిత్రం విలేజ్ డ్రామాగా రూపొందింది. పల్లెటూరి యువకుడు తాను చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు పెళ్లిపై ఆశలు పెట్టుకోవడం, అదే సమయంలో తన తాత చనిపోవడం, ఎప్పుడో జరిగిన చిన్న పంచాయితీతో పుట్టింటికి దూరమైన అడపిల్ల చావు వేళ్ల ఇంటికి రావడం, మళ్లీ గొడవలు, పంచాయితీలు, చివరకు ఇంట్లో పెద్ద మనిషి చావుతో అందరు కలవడం, అప్పుల బాధలో ఉన్న యువకుడు మేనత్త బిడ్డను చేసుకుని కష్టాల నుంచి బయటపడటమే ఈ సినిమా కథ. తెలంగాణ సంప్రదాయాలను, కుటుంబాల్లోని మనస్పర్ధలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పల్లెటూరి కేంద్రంగా జరిగే హృదయానికి హత్తుకునే పదునైన చిత్రంగా చెప్పుకోవచ్చు.
చక్కటి మౌత్ పబ్లిసిటీతో మంచి ప్రేక్షకాదరణ
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందంటున్నారు. పల్లెటూరి ప్రేమలను, ఆప్యాయతలను ఈ చిత్రంలో బాగా చూపించారని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ నటించకపోయినా, కథలోని బలం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చక్కటి మౌత్ పబ్లిసిటీతో మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజు రోజుకు ఈ సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది.
Read Also: ‘సిటాడెల్’ కొత్త ట్రైలర్ వచ్చేసింది, అదిరిపోయే యాక్షన్స్ సీన్లు, ప్రియాంక చోప్రా అందాల విందు