Armaan Malik: బుట్టబొమ్మ... నో పెళ్లి... గుచ్చే గులాబీ... ఇప్పుడు రాజ'శేఖర్'లో...
'బుట్టబొమ్మ', 'నో పెళ్లి', 'గుచ్చే గులాబీ'... ఈ పాటలకు ఓ కనెక్షన్ ఉంది. త్వరలో విడుదల కానున్న 'శేఖర్' మూవీలో పాటకు కూడా!
'అల వైకుంఠపురములో' బుట్టబొమ్మ... 'సోలో బ్రతుకే సో బెటర్'లో నో పెళ్లి... 'వకీల్ సాబ్'లో కంటి పాప... 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో గుచ్చే గులాబీ... ఈ పాటలకు ఓ కనెక్షన్ ఉంది. అదేంటో తెలుసా? ఈ నాలుగు పాటలు పాడింది ఒక్కరే... అర్మాన్ మాలిక్. తెలుగులో పలు హిట్ సాంగ్స్ పాట్టిన ఆయన, ఇప్పుడు మరో పాట పాడటానికి రెడీ అయ్యారు.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'శేఖర్'. ఆయన భార్య, నటి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఓ పాటను అర్మాన్ మాలిక్ చేత పాడిస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో రికార్డింగ్ చేయనున్నారు. ఈ పాటను రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 4న సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటి వరకూ రాజశేఖర్ సినిమాలో అర్మాన్ మాలిక్ పాట పాడలేదు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్ సాంగ్ ఇది. ఆల్రెడీ 'శేఖర్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
వారంలో 'శేఖర్' షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకోగా... కరోనాతో రాజశేఖర్ ఆస్పత్రిలో చేరడంతో, ఆయన కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందని జీవిత చెప్పారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు. సినిమాలో 50 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తారని జీవిత తెలిపారు. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాని కూడా నటించారు.
'శేషు', 'ఎవడైతే నాకేంటి?', 'మహంకాళి', 'సత్యమేవ జయతే' సినిమాల తర్వాత రాజశేఖర్ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రమిది. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా. కాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆత్మీయ రజన్, 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
View this post on Instagram