Adipurush Movie Ban: అంత తొందరేమీ లేదు - ‘ఆదిపురుష్’ కేసుపై హిందూ సంఘాలకు కోర్టు సమాధానం!
‘ఆదిపురుష్’ చిత్ర నిషేధంపై ఢిల్లీ హైకోర్టు లైట్ గా స్పందించింది. ఈ సినిమా నిషేధంపై విచారణ అత్యవసరం కాదని తేల్చి చెప్పింది. జూన్ 30న విచారణ చేపడతామని వెల్లడించింది.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని భావించారు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేశారు. డైలాగ్స్ నుంచి వీఎఫ్‌ఎక్స్ వరకు అన్నింటిపైనా సినీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై నిషేధం విధించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
‘ఆదిపురుష్’ను నిషేధించాలంటూ కోర్టుమెట్లు ఎక్కిన హిందూ సేన
‘ఆదిపురుష్’ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలంటూ హిందూసేన ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కింది. ఈ మేరకు హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు, సీత, హనుమంతుడు లాంటి హిందూ దేవుళ్ళ పాత్రలతో పాటు రావణుడి పాత్రను హాస్యాస్పందంగా రూపొందించారని విమర్శించారు. ఈ చిత్రంలోని కథ రామాయణ ఇతిహాసంలో వివరించిన దానికి విరుద్ధంగా ఉందన్నారు. సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడి పాత్ర అత్యంత దారుణంగా ఉందన్నారు. హిందూ బ్రాహ్మణుడైన రావణుడిని ఓ ముస్లిం మాదిరిగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ మొదలుకొని, పాత్రలన్నీ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిగా ఉన్నాయని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆరాధ్య గ్రంథమైన రామాయణాన్ని పూర్తిగా నెగెటివ్ కోణంలో చూపించారని, ఈ నేపథ్యంలో వెంటనే ‘ఆదిపురుష్’ సినిమాపై నిషేధం విధించాలని విష్ణు గుప్తా కోర్టును కోరారు. అత్యవసరంగా ఈ పిటిషన్ ను విచారించాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర విచారణ అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు
‘ఆదిపురుష్’ సినిమాను నిషేధించాలంటూ హిందూ సేన దాఖలు చేసిన పిల్ ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని ఢిల్లీ న్యాయస్థానం వెల్లడించింది. న్యాయమూర్తులు తారా వితస్తా గంజు, అమిత్ మహాజన్ తో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎలాంటి అత్యవసరం లేదని, జూన్ 30న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. సినిమా ఇప్పటికే విడుదలైందని, ఈ విషయంలో తొందర అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
అటు హిందూ సేన సంస్థ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ‘ఆదిపురుష్’ సినిమాలో అనేక వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయన్నారు. అవి ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. "ఈ చిత్రం భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. నేపాల్ కూడా ఈ చిత్రాన్ని నిషేధించింది" అని న్యాయవాది తెలిపారు.
‘ఆదిపురుష్’ నిషేధం కోసం ప్రధానికి సినీ వర్కర్స్ లేఖ
ఇప్పటికే ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ఈ సినిమాను నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ సినిమా హిందువులు, సనాతన ధర్మం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెల్లడించింది. ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని కోరింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ సినిమా రాకుండా నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని జోక్యం చేసుకోవాలిన అభ్యర్థించింది. అంతేకాదు, దర్శకుడు ఓ రౌత్ తో పాటు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర నిర్మాతలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
Also read : రోజూ రాత్రిపూట ఇలా జరుగుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు - డాక్టర్‌ను సంప్రదించండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial