Adipurush: ఆదిపురుష్ విషయంలో తప్పెక్కడ జరిగింది - క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన DOP - ముందే చూసుకుని ఉంటే?
ఆదిపురుష్ సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళణి వివరించారు.
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. టీజర్ విడుదలకు ముందు వరకు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ వచ్చాక మొత్తం తలకిందులై పోయింది. దేశంలోనే ఎక్కువగా ట్రోల్ అయిన సినిమాగా ‘ఆదిపురుష్’ మారింది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో కార్టూన్ సినిమా తీశారంటూ ట్రోల్స్ వచ్చాయి. దీంతో టీం జాగ్రత్త పడింది. సినిమా విడుదలను ఆరు నెలలు వాయిదా వేసి గ్రాఫిక్స్‌పై మళ్లీ వర్క్ చేస్తున్నారు. అసలు ‘ఆది పురుష్’ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కార్తీక్ పళణి మాటలు వింటే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ పళణి మాట్లాడుతూ ‘ఆదిపురుష్ పూర్తిగా మోషన్ క్యాప్చర్ కాదు. ఇందులో లైవ్ యాక్షన్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. మోషన్ క్యాప్చర్ క్యారెక్టర్స్, లైవ్ యాక్షన్ క్యారెక్టర్స్ ఒకే స్క్రీన్‌లో కనిపించే సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ టెక్నాలజీ మనకి పూర్తిగా కొత్త.’
‘ఆదిపురుష్‌కి ఒక ఫిక్స్‌డ్ బడ్జెట్ అనుకున్నాం. కానీ అవతార్ లాంటి హాలీవుడ్ సినిమాలు తీసే టెక్నాలజీ కావాలంటే దానికి బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుంది. కేవలం ఆ టెక్నాలజీ కొనడానికి అయ్యే ఖర్చుతోనే మూడు ఆదిపురుష్‌లు తీయవచ్చు. అయితే అప్పుడు కూడా కేవలం టెక్నాలజీ కొంటే సరిపోదు. దాన్ని సరిగ్గా వాడుకుని అందులో నుంచి అవుట్ పుట్, రెండరింగ్ మొత్తం చేసుకోవాలి. మనదేశంలో సినిమాలకు ఉన్న ఫైనాన్షియల్ స్పేస్‌లో ఈ బడ్జెట్ సినిమా అస్సలు వర్కవుట్ అవ్వదు.’
‘కానీ అలాంటి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం. మన బడ్జెట్‌లో అటువంటి సినిమా తీయడం ఎలా సాధ్యం అవుతుంది? అనే దానిపై పరిశోధన చేసి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలోనే కొంచెం చవకైన వెర్షన్‌ను కొనుగోలు చేశాం. దాన్ని స్టూడియోనే కొనుగోలు చేసింది. మన భారతదేశ టెక్నీషియన్లలో దానిపై అవగాహన ఉన్న వారిని తీసుకున్నారు. వాళ్లంతా ఒక టీమ్‌గా ఫాం అయి ఏం కావాలనే దానిపై రీసెర్చ్ చేశారు. ఈ టెక్నాలజీ గురించి నాకు కూడా పూర్తిగా ఐడియా లేదు. అందరం కూర్చుని చర్చించుకున్నాం. ప్రతి సీన్‌ను బ్రేక్ డౌన్ చేసి ఎలా తీస్తే బాగుంటుందని ఆలోచించాం. ఈ కాన్సెప్ట్‌ను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయనే విషయం కూడా చర్చకు వచ్చింది.’
‘అప్పుడే ఈ సినిమాని పూర్తిగా బ్లూ స్క్రీన్‌లో తీయాలని డిసైడ్ అయ్యాం. సెట్‌లో కేవలం యాక్టర్స్ ఇంటరాక్ట్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటే అవి తప్ప మిగతావన్నీ బ్లూ స్క్రీన్ పైనే షూట్ చేశాం. ఆ బ్లూ స్క్రీన్‌నే కోటగా ఊహించుకోవాలి, దాన్నే అడవిగా ఊహించుకోవాలి, రాత్రి, పగలు, ఎండ, వర్షం అన్నీ బ్లూ స్క్రీన్ పైనే ఊహించుకోవాలి. ఆకాశం నుంచి ఏదైనా పడుతుంది అనుకున్నా కూడా మనం దాన్ని మనసులోనే విజువలైజ్ చేసుకుని దానికి తగ్గట్లు షాట్లు డివిజన్ చేసుకోవాలి, లైటింగ్ సెట్ చేసుకోవాలి.’
‘టీజర్ రిలీజ్ తర్వాత బాగా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇది ఒక లార్జ్ స్క్రీన్ ఫార్మాట్, 3డీ ఫార్మాట్. అలాంటి ఎక్స్‌పీరియన్స్ మొబైల్ స్క్రీన్‌లో రాదు. క్వాలిటీ విషయంలో ఇంకా బెటర్‌మెంట్ జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా బాగుంటుంది. జూన్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతానికి వాయిదా ఆలోచన లేదు.’ అన్నారు.
ఈ మాటలు విన్నాక ఎటువంటి టెక్నాలజీతో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందనే ఆలోచన కూడా లేకుండానే దిగినట్లు తెలుస్తోంది. చవకైన వెర్షన్‌తో తీస్తున్నప్పుడు అవుట్‌పుట్ ఎలా వస్తుందనే దానిపై కనీసం ముందుగా ట్రయల్ షూట్ చేసి అవుట్ పుట్ చూసుకున్నా ఈ ట్రోల్స్ తప్పేవి. జూన్‌లో విడుదల అయ్యే వెర్షన్‌లో అవుట్‌పుట్ ఎలా ఉంటుందో తెలియాలంటే దీనికి సంబంధించి కనీసం ప్రమోషనల్ కంటెంట్ అయినా విడుదల అవ్వాలి.