Siddham Sabha: ఈ నెల 19న మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ.. కసరత్తు చేస్తున్న వైసీపీ
Siddham Meeting : వైసీపీ నాలుగో సిద్ధం సభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న సభ నిర్వహించబోతోంది. మేదరమెట్లలో నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది.
Siddham Meeting In Medaramet: అధికార వైసీపీ నాలుగో సిద్ధం సభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న సభ నిర్వహించబోతోంది. ఇప్పటి వరకు వైసీపీ సిద్ధం పేరుతో మూడు సభలను నిర్వహించింది. ఎన్నికలకు కేడర్‌ను సమాయత్వపరిచే ఉద్ధేశంతో సిద్ధం సభలు నిర్వహిస్తోంది. తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో నిర్వహించారు. రెండో సభను ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ సమీపంలో నిర్వహించారు. మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించారు. నాలుగో సిద్ధం సభను పల్నాడు ప్రాంతానికి సంబంధించి నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో సిద్ధం సభ నిర్వహణకు అనువైన ప్రాంతంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోకజవర్గ పరిధిలోని మేదరమెట్లలో నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. రాప్తాడులో నిర్వహించిన సభకు రెట్టింపు స్థాయిలో నిర్వహించేందుకు వైసీపీ సన్నద్ధమవుతోంది.
15 లక్షల మందితో సభ నిర్వహణ
రాప్తాడులో సుమారు 12 లక్షల మందితో సిద్ధం సభను నిర్వహించినట్టు వైసీపీ చెబుతోంది. నాలుగో సిద్ధం సభను 15 లక్షల మందితో నిర్వహించాలని వైసీపీ నాయకులు భావిస్తన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు హాజరుకానున్నారు. ఇందుకోసం సుమారు 500 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రసంగం ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రతి సిద్ధం సభలోనూ సీఎం జగన్ ప్రసంగాలు రెట్టించిన ఉత్సాహంతో సాగుతున్నాయి. ఫైనల్ సిద్ధం సభ.. అందులోనూ ఎన్నికలకు సమయం దగ్గరపడిన వేళ జరుగుతున్నది కావడంతో కేడర్‌ను మరింత సమాయత్తపరిచేలా ఈ సభలో సీఎం ప్రసంగం ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ విజయసాయిరెడ్డి
సిద్ధం సభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని, కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఎన్నిలకు సిద్ధం చేసేందుకు జరుగుతున్న సభలకు మంచి స్పందన వస్తోందన్నారు. సభకు 15 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. వైసీపీ సంక్షేమ పాలనలో రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన 20 ఎకరాల్లో సభ పెట్టి.. ఆరు లక్షల మంది వచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ప్రకటించి బీసీ డిక్లరేషన్ అన్నది హాస్యాస్పదమన్నారు. 75 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ప్రచారం ముమ్మరమవుతుందన్నారు.