Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీని గెలిపించింది ఆ రెండు విషయాలే
ఎస్పీ తప్పులు ఎత్తి చూపుతూ బిజేపీ విజయాలను ప్రస్తావించిన సీఎం యోగి ఆదిత్యనాథ్... నేటి విజయాన్ని ఆనాడే గుర్తించారు. కచ్చితంగా గెలుస్తున్నామంటూ కుండబద్దలు కొట్టారు. ఏబీపీకి చాలా విషయాలు చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్.. ABPకీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. శాంతి భద్రతలతో పాటు ఎన్నో అంశాల్లో యూపీ పురోగమించిందని యోగి అన్నారు. ఆయనపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను యోగి తనదైన స్టైల్‌లో ఖండించారు. ఫలితాల రోజు ఏం జరగబోతుందో ఆ రోజే చెప్పారు. అసలు ఆ రోజు యోగి ఏం చెప్పారో ఓ లుక్ వేయండి.
ప్ర: హథ్రాస్ ఘటన విషయంలో ప్రతిపక్షాలు అడుగుతోన్న ప్రశ్నలకు మీ సమాధానమేంటి?
యోగి: హథ్రాస్ ఘటన దురుదృష్టకరం. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కోరింది. యూపీ అధిక జనాభా కలిగిన రాష్ట్రం కారణంగానే మహిళలపై నేరాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్ర: యూపీ ముఖ్యమంత్రిగా మీకు మీరు ఏ ర్యాంకు ఇస్తారు?
యోగి: అత్యంత నిజాయతీగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నా పనితనానికి యావత్ దేశమే ర్యాంక్ ఇస్తోంది. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అల్లర్లు, గూండాయిజం తగ్గింది. మాఫియా కనిపించకుండా పోయింది. అభివృద్ధి అనేది యూపీకి ఓ కల.. అది ఇప్పుడు నిజమైంది. మాకు ఓటు బ్యాంకు కాదు కావల్సింది.. దాని కోసం కాదు పనిచేస్తోంది.
ప్ర: మీరు చేసిన 80 VS 20 వ్యాఖ్యలకు అర్థమేంటి?
యోగి: 80 VS 20 అని నేను అన్నది కేవలం భాజపాకు, ప్రతిపక్షాలకు ఉన్న మద్దతు గురించే. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లు గెలిచింది. దాని ఆధారంగానే మాకు 80 శాతం ప్రజల మద్దతు ఉందని వ్యాఖ్యానించాను.
ప్ర: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై మీరేమంటారు?
యోగి: ఇంట్లో, బహిరంగ ప్రదేశాల్లో ఏ రకమైన దుస్తులు వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత విషయం. కానీ విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ ఉంది. ఏ హిందూ బాలికలు.. పాఠశాలలో దుపట్టా వేసుకోవడం లేదు. స్కూల్ యూనిఫామ్ మాత్రమే వేసుకుంటున్నారు.
ప్ర: మీరు ముస్లింలను టార్గెట్ చేశారా?
యోగి: నేను ముస్లింలకు వ్యతిరేకిని కాదు. భారత రాజ్యాంగాన్ని పాటించకుండా వారివారి సొంత నియమాలను పాటించే వారికి మాత్రమే వ్యతిరేకిని. నా పరిపాలనలో హిందూ, ముస్లిం పండుగలు రెండూ శాంతియుతంగా ప్రజలు జరుపుకుంటున్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అంటే అందిరినీ కలుపుకొని వెళ్లడమే. మాఫియా నిర్వహించేవాళ్లు నేరాలు చేసేవాళ్లు ముస్లింలు అయితే నేనేం చేస్తాను. మేం నేరాల ఆధారంగానే చర్యలు తీసుకుంటాం.. మతాల వారీగా కాదు.
ప్ర: సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ మిమ్మల్ని 'బాబా సీఎం' అని పిలుస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయమేంటి?
యోగి: నన్ను అలా పిలిచి తనకు (అఖిలేశ్) స్వామీజీలు, యోగులపై గౌరవం లేదని నిరూపించుకున్నారు. ఆయన ఫోన్లు ట్యాప్ చేశామని అఖిలేశ్ ఆరోపించారు.. ఆ అవసరం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అందరికీ కనబడుతున్నాయి.
ప్ర: ఎన్నికలకు ముందు స్వామి ప్రసాద్ మౌర్య భాజపాను వీడటం మీకు ప్రతికూలం అవుతుందా?
యోగి: భాజపాలో కుల ఆధారిత రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు చోటు లేదు. ఒకే కులానికి, కుటుంబానికి టికెట్లు ఇచ్చుకుంటే పోతే మిగిలినవాళ్లు ఏం చేస్తారు.
ప్ర: అయోధ్య నుంచి కాకుండా గోరఖ్‌పుర్ నుంచి యోగి ఎందుకు పోటీకి దిగారు?
యోగి: నేను గోరఖ్‌పుర్ నుంచి కాకుండా అయోధ్య నుంచి పోటీ చేస్తే.. అప్పుడు కూడా గోరఖ్‌పుర్ నుంచి ఎందుకు పారిపోయారు అని ప్రశ్నిస్తారు. నాకు అక్కడి నుంచి పోటీ చేయాలనిపించింది.. పార్టీ కూడా అదే డిసైడ్ చేసింది.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ప్రత్యర్థులు సృష్టించిన తమదే గెలుపు అని ఆరోజు ఘంటాపథంగా చెప్పారు. ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే అదే నిజమవుతోంది.