Who is IT Minister : తెలంగాణ ఐటీ మంత్రి ఎవరు ? - కాంగ్రెస్‌లో అర్హులపై సోషల్ మీడియాలో చర్చ !
Telangana Cabinet : తెలంగాణలో ఐటీ మంత్రి ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎవరు అర్హులో చెబుతూ కొన్ని పేర్లను అర్హతలతో సహా వైరల్ చేస్తున్నారు.
![Who is IT Minister : తెలంగాణ ఐటీ మంత్రి ఎవరు ? - కాంగ్రెస్‌లో అర్హులపై సోషల్ మీడియాలో చర్చ ! There is a wide debate on social media about who is the IT minister in Telangana Who is IT Minister : తెలంగాణ ఐటీ మంత్రి ఎవరు ? - కాంగ్రెస్‌లో అర్హులపై సోషల్ మీడియాలో చర్చ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/cc3fa686a45c8029f7aa631843ad10231701869785428228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Cabinet IT Minister : తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కేటీఆర్ బెస్ట్ ఐటీ మినిస్టర్ అని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడమే. అయితే కేటీఆర్ మాత్రమే కాదని ఆయనకు మించిన బెస్ట్ ఐటీ మినిస్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటారని కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో వీరు అర్హులు అంటూ కొంత మంది పేర్లను తెరపైకి తెచ్చి వారి అర్హతలపై చర్చ పెడుతున్నారు.
బెంగళూరు తర్వాత దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీలో అగ్రగామిగా ఉంది. తెలంగాణా ఏర్పడ్డాక రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ రెండుసార్లూ ఈ శాఖను కేటీఆరే చేపట్టారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించారు. కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి కోసం రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్ ఒకరైతే, ఎల్లారెడ్డినుంచి గెలిచిన మదన్ మోహన్ రావు మరొకరని సో,ల్ మీడియా ప్రచారం చేస్తోంది.
కొత్తగా ఎన్నికైన యువకుల్లో ఐటీ మంత్రి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్న ఎమ్మెల్ేల్లో మొదటి పేరు జయవీర్. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడైన జైవీర్.. న్యూ యార్క్ యూనివర్శిటీలో బిజినెస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఐటీ రంగంపై పూర్తి అవగాహన ఉన్న జైవీర్ కు చురుకైన యువ నాయకుడిగా పేరుంది. చక్కటి వాగ్ధాటి కలిగిన నాయకుడు కూడా. ఆయన శాసనసభకు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. తాజా ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంనుంచి 56 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇక ఐటీ మంత్రి పదవికి అన్ని అర్హతలూ ఉన్న మరొక యువ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డి నుంచి గెలిచి, తాజాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న మదన్ మోహన్ కూడా విద్యాధికుడు. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీనుంచి ఎమ్మెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మదన్ మోహన్, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యుఎస్ఎమ్ గ్రూప్ చైర్మన్ గానూ, యుఎస్ఎమ్ బిజినెస్ సర్వీసెస్ సిఇఓగానూ వ్యవహరిస్తున్నారు. అనలిటిక్స్ డేటా సర్వీసెస్ సంస్థలో భాగస్వామిగానూ ఉన్నారు. ఐటీ పరిశ్రమపై మంచి అవగాహన , పరిచయాలు ఉన్నాయి. ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు.
కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో సమర్ధుడైన, ఐటీ రంగంలో ప్రవేశమున్న యువకుడు ఐటీ మంత్రిగా ఉంటేనే ఇప్పటివరకూ సాధించిన అభివృద్ది ముందుకు సాగుతుంది. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం కొత్తవారికి మంత్రిమండలిలో ఎంతవరకూ చోటు కల్పిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే, నిబంధనల ప్రకారం తెలంగాణా మంత్రిమండలిలో గరిష్ఠంగా 18మందికి మాత్రమే చోటు కల్పించాలి. కానీ, పార్టీలో పదవులకోసం పోటీ పడుతున్న సీనియర్లు చాలామందే ఉన్నారు. వారిని కాదని పార్టీ అధిష్ఠానం యువకులకు ఐటివంటి కీలకమైన శాఖను ఎంతవరకూ అప్పగిస్తుందో చూడాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)