Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు
Telangana Election Tensions: పోలింగ్ బూత్ వద్ద కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుండగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం కాగా, మెల్లగా ఘర్షణలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జనగామ జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం రేగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో ఉండడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో లాఠీలకు పని చెప్పి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
244వ పోలింగ్ బూత్ వద్ద కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. పోలింగ్ సరళి పరిశీలిస్తున్న క్రమంలో తోపులాట జరిగింది.
ఖానాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ - పోలీసుల లాఠీఛార్జ్
ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద వివాదం నెలకొనగా, ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
ఖమ్మంలోనూ గొడవలు - కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోనూ పోలింగ్ వేళ గొడవలు చెలరేగాయి. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూర్ లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
బోధన్ లోనూ ఘర్షణ
బోధన్ పట్టణంలోని స్థానిక విజయమేరీ స్కూలులో పోలింగ్ జరుగుతుండగా సమీపంలో కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. లాఠీ చార్జి చేస్తు్న్న పోలీసులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తల్ని మాత్రమే కొడుతున్నారని, బీఆర్ఎస్ మద్దతుదారులను ఏమీ అనడం లేదని విపక్ష కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.