PM Modi on KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించాం, ఈ ఎన్నికల్లో సినిమానే: ప్రధాని మోదీ
PM Modi Speech News In Telugu: తెలంగాణ సీఎం కేసీఆర్ కు మూఢ నమ్మకాలు ఎక్కువని, అంధ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేసిన ఘనుడు కేసీఆర్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi speech in mahabubabad and Karimnagar: మహబూబాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు మూఢ నమ్మకాలు ఎక్కువ అని, అందుకే సచివాలయం కూల్చేశారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అంధ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. తన నమ్మకాల కోసం ప్రజా ధనం వృథా చేసి సెక్రటేరియట్ కూల్చివేసిన సీఎం కేసీఆర్ (Telangana CM KCR) మనకు అవసరమా అని మోదీ ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పసభ (BJP Meeting in Mahabubabad)లో పాల్గొన్న మోదీ మాట్లాడతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ కు ట్రైలర్ చూపించారని, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సినిమా చూపిస్తారంటూ సెటైర్లు వేశారు.
తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని, అవినీతిపరులను కచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను నాశనం చేశాయని, బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ తమతో దోస్తీ కోసం ప్రయత్నించారని, అందులో భాగంగా గతంలో కేసీఆర్ దిల్లీకి వచ్చి బీజేపీతో కలిసి పనిచేస్తామని అడిగినట్లు మరోసారి ప్రధాని ప్రస్తావించారు. అయితే తన కుమారుడు మంత్రి కేటీఆర్ ను తెలంగాణకు సీఎంగా చేయాలని కోరగా.. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో తమపై విమర్శలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.
కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ఎండగట్టారు. ప్రధాని మోదీ పదే పదే తెలుగులో మాట్లాడుతూ, తెలుగు పదాలు చెబుతూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా కేసీఆర్ కుటుంబపాలనతో ఏ లక్ష్యాలు నెరవేరలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు బదులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ మీద పన్ను తగ్గించాం. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ మీద పన్ను తగ్గించలేదన్నారు. తద్వారా ప్రజల మీద భారం పడిందని, కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ఇప్పటికే పదేళ్లు గడిచిపోయాయని, వచ్చే ఐదేళ్లు తెలంగాణ ప్రజల భవిష్యత్ కు చాలా కీలకమన్నారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు తపన పడుతున్నారని, వారి కలలు సాకారం కావాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధి కోరుకుంటే కమలం గుర్తుకు మీ ఓటు వేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబపార్టీలు అని, వారి వల్ల కేవలం ఒకట్రెండు కుటుంబాలు బాగుపడతాయని, రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి అన్యాయం జరుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఊతం వస్తుందని, కనుక ప్రజలు ఆలోచించి ఓటు వేసి వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply