Manchryala election: మంచిర్యాల జిల్లాలో ఎవరి మంత్రాంగం ఫలిస్తుంది-త్రిముఖ పోరు తప్పదా
మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు ఏ మలుపు తిరగబోతున్నాయి. ఏ పార్టీ మంత్రాంగం ఫలించబోతోంది..? త్రిముఖ పోరులో గెలిచే నేతలు ఎవరు?
2023 ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా ముఖచిత్రం ఆసక్తి రేవుతోంది. ఈ జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క చెన్నూరులో తప్పు.. మిగతా రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ను అనుకూలంగా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల ఫలితాలు.. గెలిచిన నేతల వివరాలు ఒకసారి చూద్దాం.
మంచిర్యాల నియోజకవర్గంలో 2,27,232 మంది ఓటర్లు ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు గెలిచారు. 2014లో టీఆర్ఎస్ టిక్కెట్టు దివాకర్ రావుకు ఇవ్వడంతో.. 2009 ఎన్నికలు, 2010 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందిన గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అరవింద్‌రెడ్డికి 35,921 ఓట్లు రాగా.. టిఆర్ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావుకు 95వేల 171 ఓట్లు వచ్చాయి. ఇక.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కొరాల ప్రేమ్ సాగర్‌రావుపై గెలిచారు టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కొరాల ప్రేమ్ సాగర్‌రావు 70,512 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావుకు 75,360 ఓట్లు వచ్చాయి. 2014తో పోలిస్తే 2018లో దివాకర్ రావుకు మెజారిటీ బాగా తగ్గింది. 2023 ఎన్నికల్లోనూ నడివెల్లి దివాకర్‌రావే బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్నారు.
చెన్నూరు అసెంబ్లీ నియోజవర్గం ఎస్‌సి రిజర్వ్‌డ్ స్థానం. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో 1,48,412 మంది ఓటర్లు ఉన్నారు. చెన్నూర్ నుంచి ప్రస్తుతం బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన నల్లాల ఓదేలు.. రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్‌పై విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో నల్లాల ఓదేలుకు కాకుండా అప్పటికే ఎంపిగా ఉన్న బాల్క సుమన్‌కు టిక్కెట్ ఇచ్చింది టీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో బాల్క సుమన్.. కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్‌పై గెలిచారు. ఓటమి తరువాత వెంకటేష్ టీఆర్ఎస్‌లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి బాల్క సుమన్‌కే చెన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది బీఆర్ఎస్. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 13 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సార్లు గెలిచాయి. టీడీపీ నేత బోడ జనార్థన్ ఇక్కడి నుండి నాలుగు సార్లు విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాములు మూడు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీ రంగంలో ఉండటంతో నాలుగు ప్రధాన పార్టీల మధ్య బలమైన పోటీ జరిగింది. చివరికి టీఆర్ఎస్ అనుహ్యంగా గెలిచింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ పాతుకుపోయింది. 2009 నుంచి టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రధాన పోటీగా నిలిచింది. 2023 ఎన్నికల్లో ఇదే కొనసాగుతుందా అనేది చూడాలి.
బెల్లంపల్లి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. 2014, 2018లో టీఆర్‌ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య గెలిచారు. 2014లో సీపీఐ అభ్యర్థి జి.మల్లేష్‌ను ఓడించారు చిన్నయ్య. 2014లో దుర్గం చిన్నయకు 52వేల 528 ఓట్లు వచ్చాయి. ఇక... 2018లో బీఎస్పీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జి.వినోద్‌ను ఓడించారు దుర్గం చిన్నయ్య. వినోద్ అంతకుముందు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. 2018లో టీఆర్‌ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరపున పోటీచేశారు. కానీ ఓడిపోయారు. 2018లో చిన్నయ్యకు 11వేల 276 ఓట్ల మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్‌కు 31359 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కె.వేద నిలిచారు. ఆయనకు 10వేలకుపైగా ఓట్లు వచ్చాయి. సీపీఐ సీనియర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ డిపాజిట్ దక్కలేదు.