Second Attack on Guvvala Balaraju: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి
BRS MLA Guvvala Balaraju : అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. ప్రచారం సమయంలో ఆయనపైకి ఇటుక విసిరారు దుండగులు. ఈ దాడులు కాంగ్రెస్ పనే అని ఆరోపించారు బాలరాజు.
Second Attack on Guvvala Balaraju: అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA), బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజు (MLA Guvvala Balaraju)పై వరుస దాడులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి మరోసారి బాలరాజుపై దాడి జరిగింది. నిన్న రాత్రి... నాగర్‌కర్నూలు జిల్లా(Nagarkurnool District) అమ్రాబాద్ మండలం కుమ్మరోళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు బాలరాజు. ఎమ్మెల్యే రాగానే.. ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డ్యాన్స్‌లు, కోలాటలు, నృత్యాలు చేస్తూ... సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలరాజును భుజాలపైకి ఎత్తుకుని మోసారు. ఈ క్రమంలో... జనంలో నుంచి ఓ వ్యక్తి బాలరాజుపై ఇటుక రాయి విసిరాడు. ఆ ఇటుక.. బాలరాజు మోచేతికి తగిలింది. వెంటనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు... దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో గువ్వల బాలరాజు మోచేతికి గాయమైంది. నిన్న రాత్రి గువ్వల బాలరాజుపై దాడి చేసింది తిరుపతయ్య అని తెలుస్తోంది. అతనికి మతిస్థిమితం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
నాలుగు రోజుల క్రితం అచ్చంపేటలో బాలరాజుపై దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు బాలరాజుపై రాళ్లు విసిరారు. ఆ దాడిలో గాయపడిన బాలరాజు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి బాలరాజును పరామర్శించారు. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని ఆరోపణలు చేశారు. చికిత్స తర్వాత కోలుకుని ప్రచారం మొదలుపెట్టిన బాలరాజుపై మళ్లీ దాడి జరగడం కలకలం రేపుతోంది.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై వరుస దాడులు.. కాంగ్రెస్ కుట్ర అని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గువ్వల బాలరాజును హతమార్చేందుకు రెక్కీ నిర్వహిస్తూ దాడులు చేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ దాడులు కాంగ్రెస్ పనే అంటూ బాలరాజు కూడా ఆరోపిస్తున్నారు. ఓడిపోతారని తెలిసి కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు బాలరాజు. ప్రజల ఆశీర్వాదం తనకు ఉన్నంత వరకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరని అన్నారు ఎమ్మెల్యే గువ్వల.