Telangana CM KCR resigns: సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై, అప్పటివరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా!
CM KCR Resigns: కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి తన రాజీనామా లేఖను సమర్పించారు.
KCR resigns to Telangana CM Post: హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామాకు ఆమోదం లభించింది. సీఎం పదవికి రాజీనామా లేఖను గవర్నర్ కు కేసీఆర్ పంపించారు. కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ అధినేతకు సూచించినట్లు సమాచారం.
అంతకుముందు సీఎం పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. ఎలాంటి కాన్వాయ్ లేకుండా నార్మల్ గానే రాజ్ భవన్ కు వెళ్లారు. అనంతరం గవర్నర్ తమిళిసైకి తన రాజీనామా లేఖను కేసీఆర్ సమర్పించారని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేతగా కేసీఆర్ రాజకీయం మరోస్థాయికి చేరుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణకు తొలి సీఎంగా కేసీఆర్ ఘనత సాధించారు. ఆపై 2018లో ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఏకంగా 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో వరుసగా రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014 నుంచి నేటివరకు దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన సేవలు అందించారు.
మరోవైపు ఎమ్మెల్యేగా కామారెడ్డి నుంచి కేసీఆర్ ఓటమి చెందారు. ఉత్కంఠభరితంగా సాగిన కామారెడ్డి పోరులో చివరకు బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. సమీప ప్రత్యర్ధి కేసీఆర్ పై బీజేపీ నేత రమణారెడ్డి విజయం సాధించి బీఆర్ఎస్ శ్రేణులకు భారీ షాకిచ్చారు. అయితే సీఎంతో పాటు మరో పార్టీ సీఎం అభ్యర్థిని ఓడించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు బీజేపీ నేత వెంకట రమణారెడ్డి.
ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS Party)ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత్ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్. టీఆర్ఎస్ అధ్యక్షుడైన కేసీఆర్ 14వ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలు నెగ్గారు. తరువాత రాజకీయ పరిణామాలతో యూపీఏ నుంచి వైదొలిగారు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నుండి విజయం సాధించారు.
2014 జూన్ లో తెలంగాణకు కేసీఆర్ తొలి సీఎం అయ్యారు. ఆపై 2018 డిసెంబరు 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, డిసెంబరు 13 గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్ భవన్‌లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టారు. గ్యాప్ లేకుండా ఎక్కువ కాలం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన నేతల్లో ఒకరిగా కేసీఆర్ నిలిచారు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగానూ నెగ్గారు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి 2006 (ఉప ఎన్నికలు), 2008 (ఉప ఎన్నికలు) ఎంపీగా గెలిచారు. ఆపై 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా నెగ్గిన సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లి విజయం సాధించారు. 2014, 2018లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.