ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన సోషల్ మీడియా- ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుంటున్న అభ్యర్థులు
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ మేనిఫెస్టో, ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. 2018 ఎన్నికలు ఒకెత్తయితే, 2023 ఎన్నికలు మరో ఎత్తు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ మేనిఫెస్టో, ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. 2018 ఎన్నికలు ఒకెత్తయితే, 2023 ఎన్నికలు మరో ఎత్తు. నేతల ప్రచార స్టైల్ ను మార్చేశారు. గతంలో మైక్ లు పట్టుకొని ప్రసంగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనాల్లోకి వెళ్లి హామీలు గుప్పించాల్సిన అవశ్యకత లేదు. ఇప్పడంతా సోషల్ మీడియానే. ప్రచారమైనా, విమర్శలైనా, ఎన్నికల హామీలైనా. ఇంట్లో కూర్చొని ఓటర్లను తమ వైపు తిప్పుకొవచ్చు. చైతన్యం తీసుకురావచ్చు అదే సోషల్ మీడియా. కొందరు నేతలు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్ ఏర్పాటు చేసుకొని రోజువారీ కార్యక్రమాల వివరాలు, ప్రజలతో కలిసి ఉండే సందర్భాలను సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తున్నాయి.
ప్రచారం కోసం కోట్లు ఖర్చు
ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాపైనే ప్రధానంగా ఆధారం పడ్డాయి. పార్టీలు, అభ్యర్థులు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను నియమించుకుంటున్నాయి. లక్షల ఖర్చు పెట్టి ఆఫీసులను అద్దెకు తీసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో, రాజకీయాలపై అవగాహన, అనుభవం వారిని తీసుకుంటున్నాయి. ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి, తమ తరపున ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను వాడేసుకుంటున్నాయి. ఏ పార్టీ అభ్యర్థులైన ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. డిమాండ్ కు తగ్గట్టు డిజిటల్ పొలిటికల్ మార్కెటింగ్ ఏజెన్సీలు నియమించుకుంటున్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు తమ క్లయింట్లకుగా ఒక్కో నేత దగ్గర కోట్లు వసూలు చేస్తున్నాయి.
సోషల్ మీడియానే కీలకం
ప్రచారానికి ఎన్ని రకాల అవకాశాలుంటే...అన్ని దారులను ఉపయోగించుకుంటున్నారు. పార్టీ, అభ్యర్థులు ప్రచారాన్ని ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొనసాగిస్తున్నారు. అందరి అర చేతిలో ఇపుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఈజీగా ఓటర్లకు చేరువయ్యేలా చేస్తోంది. సోషల్ మీడియాతో ప్రచారం ఇప్పుడు ట్రెండ్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిగే ప్రతి ఎలక్షన్ కు సోషల్ మీడియా ప్రధాన అస్త్రమైపోయింది. పార్టీలకు సోషల్ మీడియా విభాగం ఉంటుంది. సోషల్ మీడియా వార్ రూంలోనే ప్రచార నిర్ణయాలన్నీ జరిగిపోతుంటాయి. సోషల్ మీడియాను ప్రచారం చేసే సంస్థలు క్యాచీగా క్యాప్షన్లు రావడం, స్థానిక అంశాల మీద ఫోకస్ చేయడం, అభ్యర్థి గుణగణాల గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసేందుకు, వారి అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు సోషల్ మీడియానే వాడుకుంటున్నాయి.
గెలుపోటములను డిసైడ్ చేస్తుంది
రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారిన సోషల్ మీడియా, అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తుంది. ఎక్కడేం జరిగిన, ఎవరు ఎవర్ని విమర్శించినా, కించపరిచే వ్యాఖ్యలు చేసిన నిమిషాల్లో పాకిపోతుంది. అదే సోషల్ మీడియాకు ఉన్న బలం. దీంతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి చేసిన మంచైనా, చెడైనా జనాల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను కీలకంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న రెండు మూడు నెలల నుంచే సోషల్ మీడియాలో పార్టీలు, నేతల మాటలు, వీడియోలు, నినాదాలు హోరెత్తుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో అభ్యర్థులు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామంఇలా అనేక సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.