బీజేపీకి జేజమ్మ హ్యాండిస్తారా ? కాంగ్రెస్ లో చేరడయే ఖాయమేనా ?
మాజీ మంత్రి డీకే అరుణ సైతం కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు సమాచారం.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు. తలపండిన మేధావులు కూడా తెలంగాణలో రాజకీయాలపై అవగాహనకు రాలేకపోతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కు బూస్ట్ ఇచ్చాయి. అనేక సర్వేలు కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. సర్వేల ఫలితమో, కర్ణాటక ఎన్నికల్లో గెలుపో కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. దీంతో హస్తం పార్టీని బీజేపీలో చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు సొంతగూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు.
2018 ఎన్నికల తర్వాత పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఎక్కువ కాలం కొనసాగేందుకు సీనియర్ నేతలు ఇష్టపడటం లేదు. తెలంగాణలో ఆ పార్టీ రోజురోజుకు దిగజారుతుండటంతో ఒక్కొక్కరుగా కమలం పార్టీని వీడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉందని ప్రజలు నమ్ముతుండటంతో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీలోనే కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి రాం రాం చెప్పేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ సైతం కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు సమాచారం. హస్తం పార్టీ నుంచి సష్టమైన హామీ రావడంతో ఘర్ వాపసీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీకే అరుణ పార్టీలో చేరితే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురుండదని నేతలు భావిస్తున్నారు.
మక్తల్ లేదా దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు ఇస్తే కాంగ్రెస్ లో వస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ డిమాండ్ కు కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గద్వాల నియోజకవర్గంలో 2004,2009,2014 ఎన్నికల్లో డీకే అరుణ విజయం సాధించారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అరుణ...రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీలో చేరారు. తాజాగా సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా గజ్వేల్ తో పాటు మునుగోడు నుంచి పోటీకి సై అంటున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన సొంత గూటికి చేరుకోనున్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ మునుగోడుతో పాటు ఎల్బీ నగర్ సీటు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన పోటీ చేసేందుకు ససేమిరా అన్నారు. అనుచరులు, కార్యకర్తల సూచనల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఆయన అనుచరులంతా కాంగ్రెస్ లో చేరాలన్న ఒత్తిడికి తలొగ్గారు. ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరుతున్నారు.