విమోచన దినంపై ఎన్నికల ఎఫెక్ట్- పెరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ మొదలైంది. సీడబ్ల్యూసీ సమావేశాల తర్వాత...సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ మొదలైంది. సీడబ్ల్యూసీ సమావేశాల తర్వాత...సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని కోసం మూడు రోజుల క్రితం రక్షణ శాఖకు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది. సభ నిర్వహణకు కాంగ్రెస్ అనుమతి కోరింది. అదే రోజు బీజేపీ కూడా పరేడ్ గ్రౌండ్స్ లోనే...తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో ఉంది. గతేడాది పరేడ్ గ్రౌండ్స్‌లోనే కేంద్రం ఆధ్వర్యంలో బీజేపీ సభ నిర్వహించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయం వేడెక్కింది.
తెలంగాణలో ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. బీజేపీ అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైంది. గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రేపోమాపో తొలి జాబితాను విడుదల చేయనున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తోంది. తద్వారా ఎన్నికల సమరశంఖం పూరించడమే కాకుండా...పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని నిర్ణయించుకుంది.
తెలంగాణ విమోచనం దినానికి ఎన్నికల ఎపెక్ట్ పడనుంది. సీడబ్ల్యూసీ సమావేశాలను ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 17న సాయంత్రం హైదరాబాద్ సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించేందుకు అనుమతి కోరామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి...బహిరంగ సభ, సీడబ్ల్యూసీ సమావేశంపై సమీక్ష నిర్వహించనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే నేతలు ఈనెల 18 నుంచి ప్రచారం చేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
హోం మంత్రి అమిత్ షా, సోనియాగాంధీ సభలను తలదన్నేలా ఏం మెసేజ్ ఇవ్వాలన్న దానిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఒకే రోజున ప్రత్యర్థి పార్టీల నేతల స్పీచ్‌లు ఉంటున్నందున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపే విమోచనా దినోత్సవాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో..ఆ రెండు పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు దీటుగా, పోటీగా ఏం చేయాలనే దానిపై గులాబీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17కు ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన అంతమై భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజును...ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పాటిస్తోంది. విలీనం, విమోచనం, విద్రోహం లాంటి చర్చలు దీర్ఘకాలంగానే సాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. బీజేపీ సెప్టెంబరు 17ను విమోచనా దినం గా పరిగణిస్తోంది. అధికార బీఆర్ఎస్ మాత్రం జాతీయ సమైక్యతా దినంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ...ఇటు బీజేపీ నేతలు పరేడ్ గ్రౌండ్ కోసం పోటీ పడుతున్నాయ్. రక్షణ శాఖ అధికారులు ముందు దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుమతిస్తారా ? లేదంటే బీజేపీ సభకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.