(Source: ECI/ABP News/ABP Majha)
Ganta At Bheemili Assembly constituency: భీమిలి మెడలో గంటా- అభిప్రాయసేకరణతో క్లారిటి
Bheemili Assembly constituency:గంటా శ్రీనివాసరావుకు టీడీపీ తరఫున భీమిలీ టికెట్ కన్పామ్ అయితే మాత్రం ఇక్కడ ఆసక్తికరమైన పోరు ఖాయంగా కనిపిస్తోంది.
Andhra Pradesh News: ఇన్నిరోజుల ఊగిసలాటకు తెరపడినట్టే కనిపిస్తోంది. గంటా శ్రీనివాస రావు విషయంలో టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కోరినట్టుగానే భీమిలిలో పోటీకి ఓకే అన్నట్టు సమాచారం. ఇప్పటికే 139 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇంకా ఐదు సీట్లపై క్లారిటీ లేకపోవడంతో ఇంకా చర్చలు సాగిస్తోంది. ఆ ఐదు సీట్లలో భీమిలి ఒకటి అయితే రెండోది చీపురుపల్లి.
చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి
పోటీ చేసిన చోట పోటీ చేయకుండా విజయాలు సాధిస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా నియోజకవర్గం మారే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ని చీపురుపల్లి పంపించి బొత్స సత్యానారాయణపై పోటీ చేయించాలని టీడీపీ భావించింది. ఇదే విషయాన్ని గంటా శ్రీనివాసరావుకి కూడా చెప్పింది. అయితే అక్కడ పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన ఆయన పోటీకి ససేమిరా అన్నారు.
ఒప్పించే ప్రయత్నం చేసిన చంద్రబాబు
ఒకట్రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్పారు. తాను ఉండే వైజాగ్‌కు చీపురుపల్లిదూరం అవుతుందని ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమని అందుకే పోటీ చేయలేనంటూ సుతిమెత్తగా చెప్పేశారు. తన అనుచరులతో కూడా మాట్లాడి ఫైనల్ చేస్తానని వివరించారు. ఈ మధ్య కాలంలో కీలమైన తన అనుచరులతో మాట్లాడారు. వారు కూడా అక్కడ పోటీ మంచిది కాదని చెప్పడంతో చీపురుపల్లిలో పోటీకి అంగీకరించలేదు.
మొదటి నుంచి విశాఖపైనే ఫోకస్
గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి భీమిలి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడే తనకు టికెట్ ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతూ వచ్చారు. మొత్తానికి ఇన్ని రోజుల ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. ఆయన పేరుతో నియోజకవర్గంలో టీడీపీ అభిప్రాయసేకరణ చేపట్టింది. అందులో గంటా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారని ఆయనకు టికెట్ కచ్చితంగా వస్తుందని అనుచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వాయిస్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
భీమిలిలో స్నేహితుల మధ్య సమరం
గంటా శ్రీనివాసరావుకు టీడీపీ తరఫున భీమిలీ టికెట్ కన్పామ్ అయితే మాత్రం ఇక్కడ ఆసక్తికరమైన పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. టీడీపీ టికెట్ గంటాకు వస్తే మాత్రం భీమిలిలో గంటా వర్సెస్ అవంతి ఉంటుంది. మొన్నిటి వరకు ఒకే పార్టీలో ఉంటూ వాల్లిద్దరు మంచి స్నేహితులుగా ఉండే వాళ్లు. ఇప్పుడు ప్రత్యర్థులై తలపడబోతున్నారు.