Avinash Vs Sharmila: కడప గడ్డపై మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఢీ- ఈసారి ప్రధాన అజెండా ఏంటీ?
Kadapa Parliament Seat: వైసీపీ తరఫున అవినాష్ కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా షర్మిలయే అక్కడ పోటీకి దిగబోతున్నారు.
Jagan Vs Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు కొన్ని తరాలు చెప్పుకునే స్థాయిలో జరగబోతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని భవిష్యత్‌లో చూస్తామో లేదో అన్న సీన్స్ ఈసారి కనిపిస్తున్నాయి. ఏకంగా అన్నపై ఇన్ని రోజులు విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల ఆయన్నే ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది నేరుగా అన్న జగన్‌పై పోటీ కాకపోయినా ఆయన నమ్మిన బంటుగా ఉన్న అవినాష్‌ను ఢీ కొడుతున్నారు. అంటే అన్నను ఢీ కొడుతున్నట్టే.
వైఎస్ ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. వైఎస్ వివేక హత్య కేంద్రంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ కేసులో అవినాష్ పాత్ర ఉందని వైఎస్ వివేక కుమార్తె సునీతతోపాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపిస్తూ వస్తున్నారు. సొంత బాబాయ్‌ను హత్య చేసిన అవినాష్‌కు జగన్ సహాయం చేస్తున్నారని ఆయన్ని కాపాడుతున్నారని మండిపడుతున్నారు.
అవినాష్ టార్గెట్‌గా సిస్టర్స్ ధ్వయం
వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ ప్రధాన ముద్దాయి అంటూ షర్మిల, సునీతతోపాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి విమర్శలు పట్టించుకోని జగన్... అవినాష్‌కు కడప ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన సపోర్ట్ పూర్తిగా అవినాష్‌కే ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. వారి విమర్శలకు ఇలా సమాధానం చెప్పారు.
నేరుగా రణ క్షేత్రంలోకి..
అవినాష్ కడప ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తుండటంతో అక్కడ ఆయనకు పోటీగా సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా షర్మిలయే అక్కడ పోటీకి దిగబోతున్నారు. నేరుగా అవినాష్‌తో ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారికంగా దీనిపై ఇంత వరకు సమాచారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కడప ఎంపీ స్థానానికి షర్మిల పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది.
వైసీపీ పునాదులు రక్తం తడిసి ఉన్నాయని ఆరోపిస్తూన్న సునీత, షర్మిల ఇప్పుడు వారిపైనే పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
గతంలోనే ఫైట్
ఇలా వైఎస్ ఫ్యామిలీ పోటీ కొత్తకాదు. గతంలో వైఎస్ వివేకానంద కూడా వైఎస్ విజయపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్‌ను విభేదించి పార్టీ పెట్టుకున్న జగన్, విజయ తమ పదవులకు రాజీనామా చేశారు. అప్పట్లో విజయ రాజీనామాతో పులివెందులకు, జగన్ రాజీనామాతో కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ బై ఎలక్షన్‌లలో పులివెందుల నుంచి విజయకు పోటీగా వివేకానంద పోటీ చేశారు. ఆయనకు డిపాజిట్లు కూడా రాలేదు.
సునీత అనుకుంటే షర్మిల
అలాంటి ఫైట్ ఇప్పుడు మళ్లీ వైఎస్ ఫ్యామిలీలో కనిపిస్తోంది. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ అని ఆయన్ని జగన్ ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడంలేదని షర్మిల ఆరోపిస్తున్నారు. తండ్రిలేని సునీతకు తాను అండగా ఉంటానని... దోషులకు శిక్ష పడే వరకు విశ్రమించబోనని మొన్ననే ప్రకటించారు. అయితే షర్మిల ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని...సునీతను లేదా సౌభాగ్యమన్ను కడప పార్లమెంట్ స్థానంలో నిలబెడతారని అనుకున్నారంతా. దీనిపై వారిద్దరిని చాలా సార్లు ప్రశ్నిస్తే సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతామంటూ దాటవేశారే తప్ప సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అయింది. పోటీలో షర్మిలయే నిలబడుతున్నట్టు ఖరారు అయింది.
ఐదేళ్లలో తారుమారు
ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఓవైపు సంక్షేమ అజెండాతో వెళ్తున్న వైసీపీ అభ్యర్థి అవినాష్‌కు జనం ఓటేస్తారా? లేకుంటే వివేక హత్య కేసు నిందితుడు అవినాష్‌ను ఆయనకు సహకరిస్తున్న జగన్‌ను ఓడించాలన్న షర్మిల నినాదానికి మద్దతు ఇస్తారో జూన్ నాలుగున తేలిపోనుంది. వీళ్ల ఆరోపణలు మాత్రమే కాదు. సీబీఐ కూడా అవినాష్ పాత్రను అనుమానిస్తోంది. ఆయన్ని చాలా సార్లు విచారించింది. అరెస్టు కూడా చేసినట్టు పేర్కొంది. అరెస్టు అయిన కొన్ని గంటల్లోనే బెయిల్ కూడా వచ్చిందని వివరించింది. మొత్తానికి వివేక హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా కాక మాత్రం తగ్గలేదు. అప్పట్లో దీన్నే ప్రధాన అస్త్రంగా వాడుకొని జగన్ ప్రచారం చేశారు. ఈ కేసులో చంద్రబాబు హస్తం ఉందని జనంలోకి తీసుకెళ్లారు. కానీ ఐదేళ్లు తిరిగే సరికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్ హస్తం ఉందంటూ సొంత ఇంటి సభ్యులే ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడక తప్పదు.