(Source: ECI/ABP News/ABP Majha)
Warangal Revanth Reddy : కాళేశ్వరం వెళదాం రా - వరంగల్‌లో కేసీఆర్‌క రేవంత్ సవాల్
Telangana Politics : కేసీఆర్ చచ్చిన పాము అని.. ఎంత కొట్టినా వేస్ట్ అని రేవంత్ రెడ్డి తేల్చారు. వరంగల్ అభ్యర్థి కావ్య నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth challenged KCR : అసెంబ్లీకి రమ్మంటే రాకుండా టీవీ చర్చల్లో కేసీఆర్ గంటలు గంటలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ. లక్ష కోట్లు పెట్టిన కాళేస్వరం కూలిపోయిందన్నారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి వెళదాం.. ఆయన కుట్టిన అద్భుతమేంటో చూపిస్తామని రావాలని సవాల్ చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహింగసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్
రేవంత్ నోటి వెంట తెలంగాణ రెండో రాజధాని ప్రస్తావన వచ్చింది. తెలంగాణకు వరంగల్ రెండో రాజధానిగా అన్ని అర్హతలున్నాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని.. లోక్ సభ ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ కారిడార్ ను తీసుకు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తమదేనని అన్నారు.
వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం
వానలొస్తే వరంగల్ చిన్న సముద్రంలా మారిపోతుందన్నారు. వరంగల్ ను అందమైన నగరంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్ పోర్టు కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ఆ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. వరంగల్ పట్టణాన్ని పీడిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం చూపుతామని కూడా ఆయన మాట ఇచ్చారు. ఇక్కడే కూర్చుని సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
కల్వకుంట్ల కుటుంబం పీడ విరగడ అయింది !
గత పదేళ్లుగా కల్వకుంట్ల కుటుంబం దోచుకుతినిందన్నారు. మామా అల్లుళ్లకు ఇంకా అధికార మత్తు దిగినట్లు లేదని అన్నారు. తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం పీడ విరగడయిందని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం పోయిందని కొంత మంది తోక తెగిన బల్లుల్లా ఎగిరెగిరి పడుతున్నరని విమర్శించారు. కేసీఆర్ చచ్చిన పాము అని.. ఎంత కొట్టిన వేస్ట్ అని తేల్చి చెప్పారు.
బీజేపీ, మోదీపైనా రేవంత్ విమర్శలు
వరంగల్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కాజీ పేట కోచ్ ఫ్యాక్టరీని కూడా పక్క రాష్ట్రాలకు తరలించుకుపోయారని విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేస్తే కానీ గిరిజన యూనివర్శిటీని మంజూరు చేయలేదన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో మోసం చేశారని..చేనేతపై జీఎస్టీ వేసి చేనేతలపై బారం మోపారన్నారు. రైతు వ్యతిరేకత ప్రభుత్వం అయిన మోదీ సర్కార్ కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.