Telangana Elections Special : అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నంత హడావుడి పార్లమెంట్ ఎన్నికలకు ఉండదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ నియోజకవర్గం. అంత పెద్ద ఏరియాను కవర్ చేయలేరు. పైగా ప్రజల్లోనూ అంత ఆసక్తి కనిపించదు. అదే అసెంబ్లీ ఎన్నికలు అయితే చెప్పాల్సిన పనిలేదు. కింది స్థాయి వరకూ క్యాడర్ యాక్టివేట్ అవుతుంది. తెలంగాణలో నాలుగు నెలల కిందట అదే జరిగింది. కానీ ఇప్పుడు పార్లమెంట్  ఎన్నికలు వచ్చాయి. అప్పుడే అలసిపోయిన నేతలు ఇప్పుడు పెద్దగా యాక్టివ్ కాలేకపోతున్నారు. ఫలితంగా మీడియాలో కనిపిస్తున్న ప్రచారం క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. ఎంతగా అంటే కనీసం ప్రచార వాహనాలు కూడా రోడ్ల మీద కనిపించడం లేదు. 


వీలైనంత పొదుపుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల రాజకీయం                    


ఎన్నికలంటే సహజంగా కనిపించే హడావుడి తెలంగాణలో లేదు.  ఒకటి, రెండు నియోజక వర్గాల్లో తప్ప అభ్యర్థుల హంగామా అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు   ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ తర్వాత చల్లబడ్డారు. క్షేత్రస్థాయి ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు.   నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సభలు, సమావేశాలు, మైకుల హౌరుతో పట్టణాలు, పల్లెలు హౌరెత్తాయి. అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. గురువారం నాటితో నామినేషన్లు ముగిసినా ఆయా పార్టీలు, అభ్యర్థుల్లో ఎన్నికల జోష్‌ కనిపించడం లేదు. ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశాలకే పరిమితమవుతున్నారు. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచే ప్రచారం నిర్వహిస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందనే భయంతో అభ్యర్థులు వెనకడుగు వెస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పరిశీలన, తుది అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారాన్ని ఉద్ధృతం పెట్టించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 


బీఆర్ఎస్ ( TRS ) ఆవిర్భావ దినోత్సవం - ఉనికికే సవాల్ - కేసీఆర్ మరోసారి అద్భుతం చేస్తారా ?


ఓ వైపు ఎండలు - మరో వైపు అలసిపోయిన క్యాడర్ 


ఏడు శాసన సభ నియోజక వర్గాలు కలిస్తే ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం . దానికి తోడు ఎండలు 45 డిగ్రీలు దాటడంతో జనం బయటకు రాకపోవడంతో జనం లేక సభలు పలచగా ఉంటున్నాయి. దాంతో పెద్ద పెద్ద సభలు కాకుండా చిన్న చిన్న సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలకు నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఆర్భాటంగా కాకుండా తమకున్న పరిధిలో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.   ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుండటంతోనే అభ్యర్థులు ప్రచారానికి భయపడుతున్నారు. ఇప్పటి నుంచే ఎంత ప్రచారం చేసినా చివరి రెండు రోజులు డబ్బు, మద్యం పంపిణి చేయందే ఓట్లు రాలని విచిత్రమైన పరిస్థితి ఉంది. చేసిన అభివృద్థి, పోటీలో ఉన్న అభ్యర్థుల గుణగణాల కన్నా ఇవే అధిక ప్రభావాన్ని చూపే అవకాశామున్నందున  ఆచీతూచి అడుగేస్తున్నారు. 


అసెంబ్లీలో ఎన్నికల్లోనే భారీగా ఖర్చు పెట్టుకున్న పార్టీలు                    


రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మిగతా పార్టీలకంటే ఎక్కువ ఆర్థిక సామర్థ్యం ఉన్న అభ్యర్థుల్ని నిలిపింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామంటూ ఆ పార్టీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేస్తోంది. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెబుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని మరోసారి తాజాగా హమీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో రోడ్‌షోలు, సభలు, సమాశాల్లో ఆన్ని తానై విసృతంగా పాల్గొంటున్నారు. అభ్యర్థులను పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.  


బీజేపే నినాదం ముస్లిం రిజర్వేషన్ల రద్దు - కాంగ్రెస్ కౌంటర్ ఏమిటి ?


అన్ని పార్టీల్లోనూ భిన్నమైన కారణాలు                                                                   


ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ రైతు సమస్యలపై దృష్టి పెట్టింది. ఎండిపోయిన పంట పొలాలు, విద్యుత్‌ సమస్య, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీరు తదితర సమస్యలను ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తోంది.  మే 10 వరకు జరగనున్న కేసీఆర్‌ బస్సు యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాషాయ పార్టీ బీజేపీ అభ్యర్థులు ఒకటి రెండు నియోజకవర్గాల్లో సొంత చరిష్మాతో ప్రచారం నిర్వహిస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అ పార్టీ అభ్యుర్థులు మోడీనే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. పదేండ్ల అధికారం, హిందూ అనుకూల విధానాలు, తమను గట్టెక్కిస్తాయని వారు భావిస్తున్నారు. ఖర్చు కన్నా భావోద్వేగ అంశాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.