Nagarkurnool Election Results 2024: నాగర్ కర్నూలులో మల్లు రవి విజయం, ప్రభావం చూపని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Nagarkurnool Lok Sabha Election Results 2024: నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలుపొందారు. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.
Nagarkurnool Lok Sabha Elections 2024: నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఘన విజయం నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటిపై 94414 ఓట్ల మెజారిటీ సాధించారు. మల్లు రవికి 465072 ఓట్లు పోలయ్యాయి. భరత్ ప్రసాద్ కు 370658 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేవలం 321343 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం చూపలేదు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ముందు నుంచి ఆధిక్యంలో కొనసాగారు. ఉదయం 11 గంటల సమయానికి ఈయనకు 402872 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పాతుగంటి భరత్ ప్రసాద్ 73524 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 123996 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానంలోనే ఉంది.