TMC in Lok Sabha Polls: మోదీని గద్దె దించేందుకు దీదీ ప్లాన్.. 2024 ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ!
2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
జాతీయ స్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. ఇప్పటికే బంగాల్ కాకుండా పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది టీఎంసీ. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని దీదీ ప్రకటించారు.
మోసపూరిత బడ్జెట్..
కేంద్ర ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ మోసపూరితంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలను మోసం చేసే అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదన్నారు.
దీదీ ప్లాన్..
బంగాల్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతాబెనర్జీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈసారి టార్గెట్ 2024 అంటూ సంకేతాలు ఇస్తున్నారు. బంగాల్ లో ఓటర్లు ఇచ్చిన జోష్‌తో దిల్లీ కోటలను బద్దలు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో భాజపాను ఎదుర్కొని ముఖ్యంగా మోదీ-షా ద్వయాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఏ పార్టీకి లేదన్నది విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్‌కు ఆ శక్తి ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో దీదీపై దేశవ్యాప్త ప్రజాదరణ ఉందని, మోదీని ఎదుర్కొనే సత్తా ఆమెకే ఉందని దాదాపు అన్ని విపక్ష పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చూపిన తెగువే ఇందుకు సాక్ష్యం.