East Godavari News: వలంటీర్లు మూకుమ్మడి రాజీనామా వెనుక వ్యూహం అదేనా!
Amalapuram News: వైసీపీ ప్రభుత్వ మానసిక పుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఓటింగ్‌ను ప్రభావితం చేస్తోందా.. ఎన్నికల వేళ ఎందుకు వివాదం అవుతోంది.. వరుస రాజీనామాల వెనుక వ్యూహం అదేనా..
Andhra Pradesh News : వైసీపీ(YSRCP) ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఎంతో ప్రతిష్టాత్మకంగా వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేశారు.. అంతే కాదు ఆయన మానసిక పుత్రికగా కూడా అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ వలంటీర్లు వ్యవస్థపై వివాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. గ్రామ, వార్డుల్లో 50కుటుంబాలకు ఒకరు చొప్పున పెద్ద నెట్‌వర్క్‌ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ నేరుగా ఇళ్లకు చేర్చేందుకు వలంటీర్లును ఉపయోగిస్తోంది. అవ్వాతాతలకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ప్రతీ నెలా ఒకటో తేదీన అందించింది. ఎన్నికల వేళ వాలంటీర్లు ద్వారా ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఫిర్యాదు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వలంటీర్లు సేవలు వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రభావం పింఛన్ పంపిణీపై పడింది.
ఎందుకు రాజీనామా చేస్తున్నారు..?
మొదటి నుంచి కూడా ఈ వలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఈ బాధ్యతలు అప్పగించారని మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్‌తోపాటు చాలా మంది మంత్రులు వైసీపీ పెద్దలు కూడా దీన్ని ధ్రువీకరించారు. వలంటీర్లలో చాలా మంది వైసీపీ సానుభూతిపరులేనంటూ చాలా మీటింగ్స్‌లో చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ఈ వ్యవస్థపై అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి.
వలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని మొదటి నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. అదే టైంలో కొందరు వలంటీర్లు నేరుగా వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో మీటింగ్‌లలో పాల్గొనడంతో వారిపై కంప్లైంట్‌లు మరింత ఎక్కువ పెరిగాయి. ఈసీ కూడా వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఫొటోలతో ఫిర్యాదు చేయాలని చెప్పింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులురావడంతో వారిలో చాలా మందిని సస్పెండ్ చేసింది.
ఇప్పుడు పింఛన్ల పంపిణీ వారితో చేయిస్తే ఓటర్లను ప్రలోభ పెట్టే ఛాన్స్ ఉందని కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ వారితో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. తమను అనుమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వలంటీర్లు చాలా ప్రాంతాల్లో రాజీనామా చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే కుతూహలం ఉన్న వ్యక్తులు వలంటీర్ పోస్టులకు రాజీనామా చేస్తున్నారనేప్రచారం ఉంది. ఒక్క అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 300 మందికి పైగా వలంటీర్లు రాజీనామా చేశారు. వాళ్లంతా వైసీపీ అభ్యర్ధుల వెంట ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. కొత్తపేటలో ఒకే రోజు 28 మంది రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిని కలిసి ఆయన గెలుపు కోసం పని చేస్తామని వెల్లడించారు. ఇదే తరహాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇప్పటికే చాలా మంది వలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫించన్లు పై తీవ్ర ప్రభావం..
వలంటీర్ వ్యవస్థను కాదని ప్రభుత్వ ఉద్యోగులతోనే పింఛన్లుపంపిణీ చేయాలనే సరికి గందరగోళం నెలకొంది. దీనికి అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఈ పరిస్థితి ఎవరికి వాళ్లే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. 50 కుటుంబాలకు ఐదేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న వలంటీర్లు ఓట్లను ఈజీగా ప్రభావితం చేయగలరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకే వారిని మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు వలంటీర్లుకు ప్రత్యేక తాయిలాలు ఇస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ప్రతీ వైసీపీ అభ్యర్ధి నెలకు రూ.10,000 ఇవ్వాలని అధిష్టానం నుంచి అదేశాలందాయని అంటున్నారు. వారితో ప్రత్యేక సమావేశాలు పెట్టి విందులు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఈ వ్యవస్థ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలనే ప్రయత్నం చేసినట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.