(Source: ECI/ABP News/ABP Majha)
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Ibrahimpatnam RDO office: ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీవో ఆఫీసులో ఉండటంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Telangana Election Results 2023: ఇబ్రహీంపట్నం: తెల్లారితే ఓట్ల లెక్కింపు ఉంది. కానీ ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీవో ఆఫీసులో ఉండటంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికలు ముగిసి రెండు రోజులు గడిచినా పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీవో బాక్సులో ఎందుకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను తెరిచారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనను ఉధృతం చేశాయి.
స్ట్రాంగ్‌రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీఓ ఆఫీసుకు ఎలా వచ్చాయని కాంగ్రెస్ కార్యకర్తలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కు సీల్ లేకపోవడంతో కౌంటింగ్ కు ముందురోజు ఎవరు ఓపెన్ చేశారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీల్ తొలగించి ఉన్నందున రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్ ఓట్లు నమోదు చేసినట్లు సమాచారం. కానీ స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీవో ఆఫీసులో ప్రత్యక్షం కావడం, అందులోనూ వాటికి సీల్ లేకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే ఆరు పోస్టల్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారిని నిలదీశారు.
కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2018 ఎన్నికల్లోనూ ఇలాగే మోసం చేసి గెలిచారని, మరోసారి అక్రమాలు, మోసాలతో గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్వోను సస్పెండ్ చేసి రీ పోలింగ్ జరపాలని మల్ రెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వరం డీసీపీ శ్రీనివాస రావు వివాదంపై సమాచారం అందడంతో రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం Rdo కార్యాలయానికి చేరుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఉన్న ఓట్ల స్లిప్పులు ఎక్కడికి పోయాయంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన కొనసాగిస్తున్నారు. గొడవ సద్దుమణగాలని డీసీపీ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో రిటర్నిగ్ అధికారి అనంత రెడ్డిని పక్క రూమ్ లో ఉంచారు పోలీసులు. కాంగ్రెస్ అభ్యర్థికి, పార్టీ శ్రేణులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply