Elections In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్- వచ్చే వారం రాష్ట్రానికి ఈసీ బృందాలు
Elections In Andhra Pradesh: వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బృందాలు పర్యటించనున్నాయి. ఓటర్ల జాబితా, వచ్చే ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించనున్నారు.
Elections In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే నోటిఫికేషన్ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే వారంలో కేంద్రం ఎన్నికల సంఘం(CEC) అధికారులు ఏపీ(AP)లో పర్యటించి కసరత్తు మొదలు పెట్టబోతున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మొదటి విడతలోనే పోలింగ్ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
షెడ్యూల్ విడుదలకు కసరత్తు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికలు యావత్ దేశాన్నే ఆకర్షిస్తాయి. అందుకే అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ఒకదఫా ఈసీ బృందాలు వచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. దాన్ని మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. అందుకే షెడ్యూల్ విడుదలకు సంబంధించి కసరత్తు ముమ్మరం చేయబోతున్నారు.
తొలి విడతలో ఏపీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆలోచన
దేశంలో జరిగే జనరల్ ఎన్నికల(General Elections)తోపాటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా,(Odisha) సిక్కిం(Sikkim), అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh) అసెంబ్లీ ఎన్నికలు కూడా జరబోతున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా సంక్లిష్టమైనవి. అందుకే ఈ ఎన్నికలను మొదటి విడతలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని సమాచారం. వీటితోపాటు దక్షిణాదిలోని లోక్‌సభ పోలింగ్ కూడా నిర్వించాలని చూస్తోంది.
2019లో కూడా తొలివిడతలోనే పూర్తి
2019 ఎన్నికల్లో కూడా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను పూర్తి చేసింది. గత జనరల్ ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి. ఏప్రిల్ 11న ప్రారంభమై మే 19న ముగిశాయి. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీతో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆలోచిస్తోంది.
మరోసారి రాష్ట్రానికి ఈసీ బృందాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు తొలి విడతలో నిర్వహించాలని భావిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికే ఓసారి బృందాలను పంపించి సమీక్షలు నిర్వహించింది. ఇప్పుడు పూర్తిస్థాయి కసరత్తు కోసం ఈసీ టీమ్స్ ఏపీకి రానున్నాయి. జనవరి 9,10 తేదీల్లో ఈసీ బృందాలు ఏపీలో పర్యటిస్తాయి.
ఓటర్ల జాబితాపై ప్రధానంగా దృష్టి
ఏపీలో పర్యటించబోతున్న ఎన్నికల సంఘం అధికారులు ముఖ్యంగా ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. మొన్నీ మధ్య ఏపీలో పర్యటించిన అధికారులు ఓటర్ల జాబితాలో తప్పులకు, లోపాలకు ఛాన్స్ లేదని వార్నింగ్ ఇచ్చారు. కొందరిపై చర్యలు కూడా తీసుకున్నారు. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని కూడా సూచించారు. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో ఉన్న లోటుపాట్లు, సమస్యలను పరిష్కరించేందుకు కసరత్తు చేయనున్నారు.
అధికారుల బదిలీపై ఫోకస్
అధికారుల బదిలీలపై కూడా దృష్టి పెట్టబోతున్నారు. సొంత జిల్లాలో అధికారులు పని చేయడానికి వీల్లేదని, మూడేళ్లకు మించి ఉన్న వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ప్రక్రియ పూర్తైందా లేదా అన్నది చూడబోతున్నారు.
పర్యటన పూర్తైతే షెడ్యూల్
ఇలా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బృందాలు తిరబోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఎన్నికల నాటికి ఎలాంటి సమస్య లేకుండా జాగ్రత్త పడబోతున్నాయి. అన్నీ ఒక అనుకున్న తర్వాత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.