Amit Shah Fake Video Case : తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తకు మూడు రోజుల కస్టడీ - అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ కోర్టు నిర్ణయం
Telangana News: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అరుణ్ రెడ్డికి మూడు రోజుల కస్టడీ విధించిది ఢిల్లీ కోర్టు. ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరుణ్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు.
Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త, స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరుతో సోషల్ మీడియా పేజీల్ని నడుపుతున్న అరుణ్ రెడ్డికి ఢిల్లీ కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. అరుణ్ రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియాకు నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అరుణ్ రెడ్డిని అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఢిల్లీ తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. మూడు రోజులు కస్టడీ కావాలని కోరారు. న్యాయమూర్తి ఆ మేరకు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో అరుణ్ రెడ్డి ఫోన్లను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.
అరుణ్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని మాణిగం ఠాగూర్ సోషల్ మీడియాలో మండిపడ్డారు. అరుణ్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Our Telangana colleague Arun Reddy, has been detained by @DelhiPolice for 24hrs with no information or FIR disclosed. We demand the immediate release of Arun. This authoritarian misuse of power by the regime is condemnable. #ReleaseSpiritOfCongress #ReleaseArunReddy pic.twitter.com/bL0dG2O4UD
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2024
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అరెస్టులు
ఢిల్లీ పోలీసుల విభాగం ఇంటలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఐఎఫ్‌ఎస్‌వో అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఎడెనిమిది రాష్ట్రాలకు చెందిన పదహారు మందికి నోటీసులు జారీ చేసింది.అందులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె సతీశ్‌తో పాటు ఆస్మా తస్లీం, అంబాల శివకుమార్, నవీన్, కోయ గీత, పెండ్యాల వంశీకృష్ణలకు నోటీసులు ఇచ్చారు. వీరందర్నీ అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారు. అయితే వారు రావడానికి ముందే తెలంగాణలో ఇదే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.
తర్వాత కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు ఒకే కేసుకు సంబంధించి మరోసారి అరెస్టు చేయకూడదని వీరంతా శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే‘ఫేక్ వీడియోకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు రని.. తిరిగి అవే ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి మాకు నోటీసు జారీ చేశారని నిందితులు తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 91/160 కింద జారీచేసిన ఈ నోటీసులను కొట్టేయాలి’ అని పేర్కొంటూ లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఢిల్లీ పోలీసులకు వారిని అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. చివరికి స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధి అరుణ్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.