Anantapur News: అనంతపురం అర్బన్ శాంతించిన టీడీపీ అసమ్మతి నేతలు - అభ్యర్థితో కలిసి ప్రచారం
Andhra Pradesh News: అనంతపురం అర్బన్‌లో టీడీపీ అసంతృప్తులు శాంతించారు. కూటమి అభ్యర్థిగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో కలిసి ప్రచారం చేస్తున్నారు.
Anantapur Urban Assembly Constituency : తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులను ప్రకటించేంతవరకు ఆయన పేరు ఎక్కడ వినిపించలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం బగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికే టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అవేమి పట్టించుకోని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధినేత అభ్యర్థిగా ప్రకటించడంతో తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ ముందుకు సాగారు.
ఒకటైన ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునివ్వడంతో నియోజకవర్గంలోని నేతలందరూ కూడా వర్గ విభేదాలకు పోకుండా పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం కొన్ని రోజులుగా కూటమి అభ్యర్థి టిడిపి నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు సహకరించడం లేదు. దీంతో టిడిపి అధినేత కొందరి నేతలతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలను సరి చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, టిడిపి నేత నానికి అప్పగించారు. బాబు ఆదేశాలతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలను ఈ ఇద్దరు నేతలు చక్కబెట్టారు. కూటమి అభ్యర్థిని గెలిపించే దిశగా ముందుకు నడవాలని వైకుంఠం ప్రభాకర్ చౌదరితో చెప్పార. అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానంటూ ప్రభాకర్ చౌదరి హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలోని టిడిపి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. కూటమి అభ్యర్థిని గెలిపించడంలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వర్గ నేతలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రసాద్ :
అనంతపురం జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువే. ఇక్కడ నేత ఎవరైనా సరే తమ వర్గమే బలంగా ఉందంటూ కొందరు నేతలు ప్రచారం చేసుకుంటూ వారి వర్గాన్ని బలంగా చూపించుకుంటారు. గతంలో అనంతపురం అర్బన్‌లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం, జేసి దివాకర్ రెడ్డి వర్గం ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో కొత్త వ్యక్తి అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ ఇవ్వడంతో జెసి వర్గమంతా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు మద్దతును తెలిపింది.
చంద్రబాబు ఆదేశాలతో వైకుంఠ ప్రభాకర్ చౌదరి వర్గం కూడా దగ్గుపాటి వెంకటేశ్వర్‌కు మద్దతు తెలపారు. దీంతో అనంతపురం అర్బన్‌లో టిడిపి విజయ అవకాశాలు మెరుగయ్యాయని నేతలు చెబుతున్నారు. పార్టీకి ఆంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న కొందరు నేతలను కూడా ప్రసాద్ వెళ్లి కలిసి తప్పకుండా పని చేయాలని రిక్వస్ట్ చేశారు. పార్టీ తగిన న్యాయం చేస్తుందని హామీ ఇవ్వడంతో ఆ నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారట. ప్రసాద్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం :
తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకి తీసుకెళ్లడంలో కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఆయన మరోవైపు పార్టీలో ఉన్న కొంతమంది అసమ్మతినేతలను సైతం దగ్గరికి చేర్చుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన వారిని సైతం ఏకం చేసేందుకు పక్క ప్రణాళిక వేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళుతూ బాబు ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాను అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
అనంతపురంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా
నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించలేదంటూ ప్రతి బహిరంగ సభలోను పెద్ద ఎత్తున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ విమర్శిస్తూ వస్తున్నారు. నియోజకవర్గానికి అవసరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను హామీలకే పరిమితం చేస్తున్న తరుణంలో అధికారం ఇస్తే తప్పకుండా అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అనంతపురం పట్టణ ప్రాంతం కావడంతో యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంలో కృషి చేస్తానని చెబుతున్నాడు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ ను గెలిపిస్తాయా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.