(Source: ECI/ABP News/ABP Majha)
AP Elections: వైసీపీ వర్సెస్ టీడీపీ- గుంటూరులో ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందా?
Andhra News: ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాపై వైసీపీ తనదైన ముద్రవేస్తోందా? అగ్ర సామాజికవర్గాన్ని పక్కన పెట్టి వ్యూహాత్మకంగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తోందాఅంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి.
AP Elections 2024: ఏపీలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ(Andhrapradesh Assembly), పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ(TDP) వర్సెస్ వైసీపీ(YSRCP)ల మధ్య పోరు ఓ రేంజ్‌లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎంత మంది పోటీ చేసినా.. ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది. వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్న వైసీపీ చాలా పెద్ద ఎత్తున వేస్తున్న వ్యూహాలను గమనిస్తే.. టీడీపీ ఆ రేంజ్‌లో ముందుకు సాగలేక పోతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా బీసీలు, శెట్టిబలిజ, ఎస్సీ సామాజిక వర్గాలకు అధికార పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు గుంటూరు(Guntur) పార్లమెంటు స్థానాలను తీసుకుంటే.. వైసీపీ(YSRCP) ఈ దఫా గుంటూరులోని మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల ప్రయోగాలు చేస్తోంది. ఒకటి గుంటూరు పార్లమెంటు స్థానం, అదేవిధంగా రెండోది నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్. ఈ రెండు స్తానాల్లో వైసీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కాపు నాయకుడు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు కుమారుడు.. ఉమ్మారెడ్డి వెంకటరమణ(Ummareddy Venkataramana)కు టికెట్ కేటాయించింది. ఇది క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా సంచలన నిర్ణయమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా.. గుంటూరు ఎంపీ టికెట్(M.P. Ticket)ను ఈ సామాజిక వర్గానికి గడిచిన నాలుగు ఎన్నికల్లో కేటాయించలేదు.
వైసీపీ నిర్ణయం తీవ్ర ప్రభావం!
దీంతో గుంటూరు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలపైనా వైసీపీ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇక, ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ మరోసారి కమ్మ నేతకు అవకాశం ఇచ్చింది. ప్రవాసాంధ్రుడైన(NRI) టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar)కు టికెట్ ప్రకటించింది. గతంలోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్ కే టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఈ సారి ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దఫా వైసీపీ మార్చిన ఈ క్వేషన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.
అదేవిధంగా నరసారావుపేటలోనూ.. వైసీపీ ప్రయోగం చేసింది. ఇక్కడ నుంచి ఏకంగా బీసీ యాదవ వర్గానికి చెందిన అనిల్‌కుమార్(P. Anilkumaryadav)కు ఛాన్స్ ఇచ్చింది. ఈయన ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఈయనను ఇక్కడకు తీసుకురావడం.. వైసీపీ చేస్తున్న సరికొత్త ప్రయోగంగానే భావించాలి. అయితే.. పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పోటీచేయడం కొత్తకాదు. గతంలో ఇదే జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున నరసారావుపేటలో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈసారి మాత్రం బీసీకి వైసీపీ టికెట్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. ఇక, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏపార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అలాంటిది తొలిసారి వైసీపీ ప్రయోగం చేసింది.
వైసీపీ నుంచి వచ్చిన లావుకు ఛాన్స్!
మరోవైపు.. నరసరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ మరోసారి కమ్మ నేతకే అవకాశం ఇచ్చింది. అది కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయులు(Lavu Srikrishnadevarailu)కే ఛాన్స్ ఇవ్వడం సంచలనంగా మారనుంది. దీంతో ఇరు పార్టీల మధ్య పోరు తీవ్రస్థాయిలో ఉండే అవకాశం మెండుగా ఉంది. బీసీలు ఎక్కువగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్‌లో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతారో.. లేక సంప్రదాయంగా వస్తున్న కమ్మ వర్గానికే జై కొడతారో చూడాలి. 2014లోనూ కమ్మనాయకుడు రాయపాటి సాంబశివరావు నరసారావుపేట నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.