AP TET 2024: ‘టెట్’ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, ఒకే రోజు రెండు పరీక్షలు - ఒక పరీక్ష వదులుకోవాల్సిన పరిస్థితి
APTET: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీటెట్)కు హాజరు కావాల్సిన అభ్యర్థుల్లో కొందరు సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకేరోజు ఒకేసమయానికి రెండు పరీక్షలు రాయాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది.
APTET 2024 Exam Centres Controversy: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) అక్టోబరు 3 నుంచి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అయితే కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. హాల్‌టికెట్లనూ వేర్వేరుగా విడుదల చేశారు. దీంతో ఆ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. రెండు పరీక్షలూ ఒకేసారి రాయడం సాధ్యం కాదుకాబట్టి ఏదో ఒక పరీక్ష వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
➨ పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు మండలం, చొదిమెళ్ల గ్రామానికి చెందిన సంధ్యాభవానీకి అక్టోబరు 6న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1బి తెలుగు (1 నుంచి 5 వరకు స్పెషల్ స్కూల్స్) పరీక్షకు సమయాన్ని పేర్కొంటూ ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించారు. అదేరోజు, అదే సమయానికి పేపర్-1ఎ (ఒకటి నుంచి 5 వరకు రెగ్యులర్ స్కూల్స్) పరీక్షకు సమయాన్ని పేర్కొంటూ విజయవాడలోని కానూరులోని కేంద్రాన్ని కేటాయించారు. ఇటా ఒకే సమయంలో రెండుచోట్ల టెట్ పరీక్షకు హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది.
➨ మరోవైపు ముదునూరుపాడుకు చెందిన పి.జయలక్ష్మి ఎస్‌జీటీ, స్కూలు అసిస్టెంట్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్‌జీటీ పరీక్షకు ఉదయం ఏలూరులోని ఒక పరీక్షా కేంద్రాన్ని, స్కూలు అసిస్టెంట్ పరీక్షకు మధ్యాహ్నం కాకినాడలోని మరో కేంద్రాన్ని కేటాయించారు. ఏలూరు నుంచి కాకినాడ వెళ్లేందుకు కనీసం 3 గంటల సమయం పడుతుంది. రెండు పరీక్షల మధ్య కేవలం 2.30 గంటల సమయం మాత్రమే ఉండటంతో.. ఒక పరీక్ష రాయడం మానుకోవాల్సి వస్తుందని ఆమె వాపోతున్నారు.
పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న డీఈఓ..
ఒక అభ్యర్థికి ఒకేరోజు 2 వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం అరుదుగా జరుగుతుంటుందని డీఈఓ అబ్రహం వివరణ ఇచ్చారు. ఇలాంటి అభ్యర్థులు హాల్‌టికెట్లతో తమ వద్దకు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 3 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలు మాత్రం పరీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచి అంటే.. అక్టోబర్ 4 నుంచి విడుదల చేస్తారు. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదల చేసి, నవంబర్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
మాక్ టెస్టులు అందుబాటులో..
అభ్యర్థుల సౌలభ్యం కోసం సెప్టెంబర్ 19 నుంచి మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ ప్రాక్టీస్ టెస్టుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆన్‌లైన్ మాక్ టెస్టు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి అధికారులు ఏర్పాట్లుచేశారు. మొత్తం 13 మాక్ టెస్టులను కేటగిరీలవారీగా అందుబాటులో ఉంచారు. ఇందులో పేపర్-2ఎ (మ్యాథ్స్), పేపర్-2ఎ (సోషల్), పేపర్-2ఎ (లాంగ్వేజెస్), పేపర్-2బి, పేపర్-1బి, పేపర్-1ఎ ఎస్జీటీ నమూనా పరీక్షలు ఉన్నాయి.