Inter Exam Fee: రేపటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు, వెంటనే ఫీజు చెల్లించండి
Telangana Inter Fee: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువు జనవరి 3తో ముగియనుంది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది.
Telangana Inter Exam Fee: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు (Telangana Inter Fee) గడువు జనవరి 3తో ముగియనుంది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో కొన్ని కోర్సుల్లో కలిపి 10.59 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఫీజు చెల్లింపు గడవు ముగిసేనాటికి 9.77 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇంకా 82 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మరోసారి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది ఇంటర్ బోర్డు. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు రూ. 710 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 10,59,233 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో అడ్మిషన్లను పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు నిర్ణీత గడువులోపే పరీక్ష ఫీజులు చెల్లించారు. మరో 61,005 మంది విద్యార్థులు రూ.100 ఫైన్‌తో, 8,638 మంది విద్యార్థులు రూ.500ల ఫైన్‌తో, 5,212 మంది విద్యార్థులు రూ.1000 ఫైన్‌తో, 3,144 మంది విద్యార్థులు రూ.2000 ఫైన్‌తో చెల్లించారు. ఇప్పటి వరకు మొత్తంగా 9,77,040 మంది విద్యార్థులు మార్చి -2024 పరీక్ష ఫీజులను చెల్లించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
పరీక్ష ఫీజు వివరాలు ఇలా..
🔰 ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
🔰 ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.
🔰 ఒకేషనల్ విద్యార్థులైతే రూ. 710 చెల్లించాలి.
🔰 నవంబరు 14 నుంచి 30 వరకు ఫీజు ఆలస్యరుసుము లేకుండా ఫీజు స్వీకరించారు.
🔰 రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.
🔰 రూ. 100 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.
🔰 రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.
🔰 రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.
🔰 రూ. 2000 ఆలస్య రుసుంతో గడువు డిసెంబరు 29తో ముగియగా రూ.2500తో డిసెంబరు 30 నుంచి జనవరి 3 వరకు అవకాశం కల్పించారు.
పరీక్షల షెడ్యూలు వెల్లడి..
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతోపాటు, ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభంకాన్నాయి. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు, ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు జరుగనున్నాయి.
ఇంటర్ జనరల్, ఒకేషనల్, బ్రిడ్జ్ కోర్సు పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..