UPSC Results Update : 2013లో 1228 - ఇప్పుడు 710 మాత్రమే ! యూపీఎస్సీ పోస్టుల భర్తీని ఇంత భారీగా తగ్గించేశారేంటి ?
యూపీఎస్సీ ద్వారా నిర్వహించే సివిల్స్ పరీక్షల ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను కేంద్రం తగ్గిస్తోంది. ఇది ఆశావహుల్ని నిరాశకు గురి చేస్తోంది.
UPSC Results Update : సివిల్ సర్వీస్ అంటే దేశంలో యువతకు ఓ కల. కొన్ని లక్షల మంది రాస్తే.. వందల్లోనే సెలక్ట్ అవుతారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఈ సివిల్ సర్వీస్ పోస్టుల్ని తగ్గిస్తూ వస్తోంది. నమ్మలేకపోయినా రికార్డులు అవే చెబుతున్నాయి. తాజాగా విడుదలైన 2021 సివిల్స్ ఫలితాలు పరిశీలిస్తే, ఐఎఎస్‌కు-180, ఐఎఫ్‌ఎస్-32, ఐపీఎస్-150, గ్రూప్-ఏ ఆఫీసర్లు మొత్తం 710 మందిని ఎంపిక చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతి తక్కువ పోస్టులు భర్తీ చేయడం ఇదే ప్రథమం..
ఏటీకేడు తగ్గిపోతున్న సివిల్స్ నియామకాలు !
2013లో యుపిఎస్‌సి ( UPSC ) ద్వారా 1228మందిని సివిల్స్‌కు ఎంపిక చేశారు. 2021లో ఆ సంఖ్య కేవలం 749కి పరిమితమైంది. 2013లో ఐఎఎస్ కేడర్‌కు 180మందిని ఎంపికచేయగా, ఇప్పుడూ అదే సంఖ్యలో నియామకాలు జరిగాయి. మోడీ సర్కార్ ( MODI Governament ) సివిల్స్ నియామకాలను కావాలనే కుదిస్తోందన్న విమర్శ ఉంది. ఏడాది క్రితం ఐఎఎస్ కేడర్ రూల్స్‌కు కేంద్రం అనేక మార్పులు చేసింది. ఇది కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో సివిల్స్ నియామకాలపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపింది. నియామకాల సంఖ్య పెంచాలని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఏఎస్‌ల ( IAS ) కొరత తీవ్రస్థాయిలో ఉందని, అటు రాష్ట్రాలు సైతం ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.
పోస్టులు పెంచాలని పార్లమెంటరీ కమిటీ నివేదిక !
అయితే ఈ అంశంపై కేంద్రం ( Central Governament ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, మంత్రిత్వ శాఖల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల నియామకం పెంచాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి దేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల కొరత విపరీతంగా ఉంది. దాదాపుగా ప్రతి ఒక్ కరాష్ట్రం తమకు సివిల్ సర్వీస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తులు పెట్టుకుంది. అయినా ఆ ప్రకారం నియామకాలు పెంచలేదు కదా తగ్గించుకుంటూ వస్తోంది.
సమూల మార్పుల ఆలోచనతో భర్తీ తగ్గిస్తున్న కేంద్రం !
యూపీఎస్సీ నిర్వహించి సివిల్ సర్వీస్ పరీక్షలు.. సివిల్స్ వ్యవస్థలోనే కీలకమైన మార్పులు తేవాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ల నియామకాలను పెంచడం లేదని చెబుతున్నారు. యూపీఎస్సీ నియామకాల సంఖ్యను తగ్గించడం ఆశావహుల్ని నిరాశకు గురి చేస్తోంది.