Telangana SSC Exam Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంతరం టెక్నికల్‌గా అన్ని అంశాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం లక్షల మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో 2021-22 సంవత్సరానికి చెందిన పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్ 1 న చివరి పరీక్ష జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభించారు. జూన్ 30న టెన్త్ రిజల్ట్స్ ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది.
తెలంగాణలో మే 23న ప్రారంభమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 28తో ముగిశాయి. గతేడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అందుకే రెండేళ్లు నేరుగా విద్యార్థులను తరువాత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు.
ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసి వచ్చే నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నారు.
తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంతరం టెక్నికల్‌గా అన్ని అంశాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.