Telangana Schools : తెలంగాణ పాఠశాలల టైమింగ్స్ లో మార్పులు, అదనంగా మరో గంట తరగతులు
Telangana Schools : తెలంగాణ పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. మరో గంట పాటు తరగతులను నిర్వహణను పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Schools : తెలంగాణలో పాఠశాలల సమయాలు మరోసారి మారాయి. ఎండల తీవ్రత కారణంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 11.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం పాఠశాలల సమయాన్ని పొడిగించింది. మధ్యాహ్నాం 12.30 గంటల వరకు పాఠశాలలను నడపాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12.30 వరకు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఇటీవల పాఠశాలల పనివేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల దాకా తరగతులు నిర్వహించారు. తాజాగా స్కూల్ టైమింగ్స్ లో మరోసారి మార్పులు చేసింది ప్రభుత్వం. ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా బడులు నిర్వహించేవారు. కానీ మార్చి చివరి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఒక గంట సమయాన్ని తగ్గించి 11.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహించింది ప్రభుత్వం.
ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్
అయితే ఈ షెడ్యూల్ ఏప్రిల్ 6 వరకే అమల్లో ఉంటుందని గత ఉత్తర్వుల్లో పేర్కొంది. నిన్నటితో షెడ్యూల్ ముగియడంతో ఏప్రిల్ 7 నుంచి మళ్లీ తగ్గించిన సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 16 నుంచి 22 వరకూ 1-9 తరగతుల వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. 23వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. మే 23 నుంచి జూన్ 1వ తేదీ దాకా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ముందుగా మే 11 నుంచి మే 20 దాకా నిర్వహించలని అధికారులు భావించారు కానీ జేఈఈ పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్ లో విద్యాశాఖ మార్పులు చేసింది. కరోనా కారణంగా గత రెండేళ్లులో పదో తరగతి పరీక్షల నిర్వహించడం సాధ్యం కాలేదు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణుల్ని చేసింది. ఈసారి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అన్ని సబ్జెక్టులకు ఒకే పేపర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు.