Inter Summer Classes: గురుకుల ఇంటర్ విద్యార్థులకు మే 15 వరకు తరగతులు, వేసవి సెలవులు 16 రోజులే
Summer Classes: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మే 15 వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు మే 16 నుంచి 31 వరకు మాతమ్రే 16 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు.
Gurukula Inter Classes: తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 1 నుంచి తిరిగి కళాశాలలు తెరచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. అయితే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఇంటర్ విద్యార్థులకు వేసవి తరగతులు కొనసాగనున్నాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో మే 15 వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు మే 16 నుంచి 31 వరకు మాతమ్రే 16 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసి.. ప్రస్తుతం నీట్, ఎంసెట్, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో సమానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు, సెకండియర్ తరగతులు నిర్వహిస్తామంటూ గురుకుల సొసైటీ ప్రత్యేకాధికారి ప్రతిపాదనలు పంపించారు.
దసరాలోపు పాఠ్య ప్రణాళిక పూర్తి..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళికను దసరాలోపు పూర్తిచేసి, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు మే 15 వరకు ప్రత్యేక తరగతులకు అనుమతిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం ఆర్జిత సెలవులు మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే ప్రత్యేక తరగతుల నిర్ణయంపై గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని, తల్లిదండ్రుల నుంచి బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇలా..
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్ని ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30న ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు, నవంబర్ 18 నుంచి 23 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని తెలిపారు. ఆ తర్వాత జనవరి 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి మొదటి వారం థియరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇక మార్చి 29తో విద్యాసంవత్సరం క్యాలెండర్ ముగుస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇక 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని వెల్లడించారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2024-25) క్యాలెండర్ ..
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2024.
➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2024.
➥ దసరా సెలవులు: 06.10.2024 - 13.10.2024.
➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 14.10.2023.
➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 18.11.2024 - 23.11.2024.
➥ సంక్రాంతి సెలవులు: 11.01.2025 - 16.01.2025.
➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2025.
➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 20.01.2025 - 25.01.2025.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2025 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
➥ ఇంటర్ థియరీ పరీక్షలు: 2025 మార్చి మొదటి వారం నుండి.
➥ వేసవి సెలవులు: 30.03.2025 - 31.05.2025.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025 మే చివరి వారంలో
➥ 2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2025.