రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం, అయినా ఇంటర్ ఫలితాల్లో సత్తా - దాతల సాయం కోసం ఎదురుచూపు
రెండు కిడ్నీలు పాడవడంతో ఇంటికే పరిమితమైంది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్ పరీక్షల్లో మొక్కవోని ధైర్యంతో 927 మార్కులు సాధించింది గోదావరిఖనికి చెందిన సిరి.
Godavarikhani Girl Achievement in Inter Results: రెక్కాడితే గానీ డొక్కాడని బ్రతుకులు వారివి. రోజూ సెంట్రింగ్ వర్క్ చేస్తేనే పూటగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అందులోనూ ఇద్దరూ ఆడపిల్లలే. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. పేదరికానికి తోడు పెద్ద కుమార్తె సిరికి రెండు కిడ్నీలు పాడవడంతో ఇంటికే పరిమితమైంది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్ పరీక్షల్లో మొక్కవోని ధైర్యంతో 927 మార్కులు సాధించింది ఆ విద్యార్థిని. తన చికిత్సతోపాటు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు ఆర్థిక సహాయం అందిస్తే మరింత కష్టపడి చదువుతానని మనోధైర్యంతో అంటోంది ఆ యువతి.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరిఖని ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన కూనారపు పోషం, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతర్లు. వారి పెద్ద కుమార్తె సిరి గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 927 మార్కులతో సత్తాచాటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. మార్కులతో కళాశాల టాపర్‌గానూ నిలిచింది. సిరి గత 5 సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. రోజురోజుకీ వాటి పనితీరు మందగించింది. ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అప్పటి నుంచి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. అయితే సిరికి చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సహ విద్యార్థుల ద్వారా ఆమెకు చేరవేస్తూ సెల్‌ఫోన్‌లో సందేహాలను నివృత్తి చేసేవారు. ఆమె పరిస్థితిని చూసి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మొత్తానికి అటు గురువులు, ఇటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. తనకు ఆర్థిక సహాయం అందిస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానని సిరి అంటుంది.
దాతలు సహకారం కోరుతున్న సిరి తల్లిదండ్రులు..
తన వైద్యానికి ఇప్పటికే 20 లక్షల పైగా ఖర్చయిందని, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు మరింత ఖర్చు అవుతుందని సిరి తల్లిదండ్రులు ఆవేదన వ్వక్తం చేస్తున్నారు. తన కూతురికి కిడ్నీ మార్పిడికి మరో 20 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు కరుణించాలని సిరి తల్లి కోరుతుంది. కుమార్తె కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని ప్రభుత్వం, దాతలు స్పందించి చేయూత అందించాలని తండ్రి పోశం కోరుతున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 24న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 8,31,858 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా వీరిలో ఫస్ట్ ఇయర్‌లో 2,87,261మంది అంటే 60.01 శాతం, సెకండ్ ఇయర్‌లో 3,22,432 మంది అంటే 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్ ఫస్ట్ ఇయర్‌లో 24,432 మంది పరీక్షలు రాస్తే వారిలో 50.57 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక సెకండ్ ఇయర్‌లో వొకేషనల్ రెగ్యులర్ 42,723 పరీక్షలు రాస్తే 27,287 మంది, ప్రైవేట్ 3,884 పరీక్షలు రాస్తే 1549 మంది ఉత్తీర్ణులయ్యారు.