పదోతరగతి మార్కుల మెమోలపై 'పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబరు' ముద్రణ, ఎందుకు అది?
PEN: తెలంగాణ పదోతరగతి ఫలితాలను విద్యాశాఖ ఏప్రిల్ 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల మార్కుల మెమోలపై తొలిసారిగా 11 అంకెల యూనిక్ ఐడీ 'పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబరు (పెన్)' ముద్రించారు.
Permanent Education Number In Telangna SSC Memos: తెలంగాణ పదోతరగతి ఫలితాలను విద్యాశాఖ ఏప్రిల్ 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి విద్యార్థుల మార్కుల మెమోలపై వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నంబర్ (OTR) తరహాలో తొలిసారిగా 11 అంకెల యూనిక్ ఐడీ 'పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబరు (పెన్)' ముద్రించింది. యూడైస్ ప్లస్ పోర్టల్ ద్వారా జనరేట్ అయిన ఈ నంబర్‌ను మెమోలపై ముద్రించారు. ఇప్పటివరకు పదోతరగతి మెమోలపై హాల్‌టికెట్ నంబర్‌ను మాత్రమే ముద్రిస్తున్నారు. పలు రకాల అంతర్గత సెక్యూరిటీ ఫీచర్లను చేర్చారు. ఇదివరకు సర్టిఫికెట్లు అసలువో.. నకిలీవో తెలుసుకోవాలంటే అధికారులు లోతైన పరిశీలన తర్వాతే తెలిసేది. కానిప్పుడు ‘పెన్’ నంబర్ ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు.
తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి..
యూడైస్‌లో ఉన్న వారికే అవకాశం..
ప్రతి విద్యార్థి పేరు జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్ ఫ్లస్) పోర్టల్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, వివరాలను అప్‌డేట్ చేయాలని పాఠశాల విద్యాశాఖను ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే. యూడైస్‌లో ఉన్న వారికి మాత్రమే సాఫ్ట్‌వేర్ ద్వారా శాశ్వత సంఖ్య కేటాయిస్తారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆ మేరకు తాజాగా పదోతరగతి మార్కుల మెమోలపై పెన్ నెంబరును ముద్రించారు. ఇకనుంచి పాఠశాలల్లో చదివే ప్రీ-ప్రైమరీ విద్యార్థుల నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ప్రవేశ రిజిస్టర్, హాజరు రిజిస్టర్, రికార్డ్ షీట్/టీసీ తదితర వాటిపై ఈ నెంబరును రాయడం, ముద్రించడం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేశారు.
ప్రయోజనాలివే..
➥ పెన్ నంబర్‌ను అమలుచేయడం ఇ దే మొదటిసారి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అన్న తేడాల్లేకుండా అంతటా దీనిని అమలుచేస్తారు.
➥ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడీ తరహాలో నంబర్‌ను కేటాయిస్తారు.
➥ ఈ నంబర్ ద్వారా విద్యార్థి ఎక్కడ చదివారో.. ఉన్నత చదువులు తర్వాత ఏ స్థాయిలో ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.
అపార్ లేకుండానే పెన్ నంబర్ అమలు..
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా.. కేంద్ర విద్యాశాఖ డిజిలాకర్, అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ (ఏబీసీ)లను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వన్ స్టూడెంట్ వన్ ఐడీ’ పేరిట విద్యార్థులకు అటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీని విద్యార్థులకు జారీచేస్తోంది. సమగ్రశిక్ష ప్రాజెక్ట్ (SSA) ఈ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అపార్ ఐడీ జారీచేయాలంటే ముందుగానే.. విద్యార్థికి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్‌ను (PEN) జారీచేస్తారు. అయితే అపార్ ఐడీకి తల్లిదండ్రుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ పెన్ నెంబర్ జారీకి తల్లిదండ్రుల నుంచి అనుమతి అవసరం లేదు. ఈ నేపథ్యంలో అపార్‌తో నిమిత్తం లేకుండా యూడైస్‌లో నమోదైన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ పెన్ నంబర్‌ను అమలుచేస్తుంది.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు..
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్థులందరికి ఈ నంబర్‌ను జారీచేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థి ప్రయాణం, ప్రగతి మొత్తం ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు.. ఒక విద్యాసంస్థ నుంచి మరో విద్యాసంస్థకు మారిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదవుతుంటాయి. ఆన్‌లైన్‌లో నంబర్‌ను ఎంటర్‌చేయగానే విద్యార్థి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. దేశంలో మొదటిసారిగా బోగస్ విద్యార్థులను నివారించేందుకు తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి నామినల్స్‌రోల్స్‌ను యూ డైస్‌తో అనుసంధానించారు. యూ డైస్‌లో పేర్లున్న వారిచేతనే పరీక్ష ఫీజునను కట్టించారు. తాజాగా పదో తరగతి మోమోలు, టీసీలపై పెన్ నెంబర్‌ను ముద్రిస్తున్నారు.