Medical Colleges: మెడికల్ కాలేజీల్లో ఆ విధానాన్ని రద్దు చేయండి, రాష్ట్రాలకు NMC కీలక సూచన
మెడికల్ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ‘సీట్ లీవింగ్ బాండ్’ విధానాన్ని వదిలివేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సూచించింది.
NMC Diretions: దేశంలోని మెడికల్ కాలేజీలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ స్టూడెంట్స్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ‘సీట్ లీవింగ్ బాండ్’ విధానాన్ని వదిలివేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ విధానం మెడికల్ కాలేజీల్లోని విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మోయలేని ఆర్థిక భారం, భయంతో కొందరు విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తోందని ఎన్‌ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీలలో తమకు కేటాయించిన సీటును మధ్యలోనే వదిలి వెళ్లే విద్యార్థుల నుంచి కోర్సు మొత్తానికి అయ్యే ఫీజులను వసూలు చేయడానికిగాను ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు.
మెడికల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల సమయంలో అక్రమంగా సీట్లను బ్లాక్ చేయకుండా నిరోధించే ఉద్దేశంతోనూ కళాశాలలు విద్యార్థుల నుంచి ఈ మేరకు పూచీకత్తు తీసుకుంటున్నాయి. అయితే అనివార్య పరిస్థితుల్లో ఆ కోర్సు మానేయాలని భావిస్తున్న విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపుతోందని, తీవ్ర దుష్పరిణామాలకూ ఇది దారితీస్తోందని ఎన్‌ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షురాలు డా.అరుణా వి.వాణికర్ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలోనే కోర్సును వదిలేసే విద్యార్థుల నుంచి మొత్తం ఫీజు వసూలు చేయడానికి బదులుగా ఒక ఏడాది పాటు వారిని డిబార్ చేసే విషయాన్ని పరిశీలించాలని ఆమె సూచించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య, వైద్య విద్య శాఖల ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు.
ఎంబీబీఎస్ సీట్లన్నీ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పూర్తిగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆదేశించింది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఎంబీబీఎస్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ఏ వైద్య కళాశాలలోనూ నేరుగా ఒక్క సీటును కూడా భర్తీ చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తే వైద్య కళాశాలలు భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని, దీంతో పాటు సీట్లను సైతం కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మొదటిసారి నేరుగా ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తే రూ.కోటి లేదా కోర్సు పూర్తయ్యేందుకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని కళాశాల జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. రెండోసారి నేరుగా ప్రవేశం కల్పిస్తే రూ.రెండు కోట్లు లేదా కోర్సు పూర్తయ్యేందుకు చెల్లించే ఫీజుకు రెండింతలు.. వీటిలో ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. మూడోసారి కూడా ఇలాగే వ్యవహరిస్తే ప్రవేశాలు పొందిన విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేయడంతోపాటు ఆయా కళాశాలలు ఎంత మందికి ప్రవేశాలు కల్పిస్తే అందుకు రెట్టింపు సంఖ్యలో సీట్లలో కోత విధించనున్నట్లు ఎన్‌ఎంసీ వివరించింది.
పీజీ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్గదర్శకాలు (NMC Guidelines) జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది. అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలోని పీజీ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్.. ఇటీవల వెలువరించిన పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య నియంత్రణలు-2023 లో స్పష్టం చేసింది. రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు అని ఎన్ ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.