NEET Toppers: నీట్ 2022 ఫలితాల్లో 56.27 శాతం ఉత్తీర్ణత, టాప్-10లో తెలంగాణ విద్యార్థి!
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 75,492 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో ఏపీ నుంచి 40,344 మంది, తెలంగాణ నుంచి 35,148 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
NEET Result 2022: నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ ఫలితాలతోపాటు తుది కీని కూడా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
56.27 శాతం ఉత్తీర్ణులు..
నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు.
తెలుగు రాష్ట్రాల ఫలితాలు ఇలా..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 75,492 (59.67 %) మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో ఏపీ నుంచి 40,344 మంది, తెలంగాణ నుంచి 35,148 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రెండు రాష్ట్రాల నుంచి 1,29,268 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1,26,512 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఏపీ నుంచి 68,061 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 65,305 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 40,344 మంది పరీక్షలో అర్హత సాధించారు. ఇక తెలంగాణ నుంచి 61,207 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 59,296 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35,148 మంది నీట్ పరీక్షలో అర్హత సాధించారు.
టాప్-10 ర్యాంకర్లు వీరే..
సెప్టెంబరు 7న విడుదలైన నీట్ యూజీ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంకు రాగా, దిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు ఐదో ర్యాంకుతో మెరిశాడు. యూపీ, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
టాప్-10 ర్యాంకర్లు:
- తనిష్క (రాజస్థాన్) - 715 మార్కులు
- వత్స ఆశీష్ బాత్రా (దిల్లీ) - 715 మార్కులు
- హృషికేశ్ నాగ్భూషణ్ గంగూలే (కర్ణాటక) - 715 మార్కులు
- రుచా పవాశి (కర్ణాటక) - 715 మార్కులు
- ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు (తెలంగాణ) - 711 మార్కులు
- రిషి వినయ్ బాల్సే (మహారాష్ట్ర) - 710 మార్కులు
- అర్పిత నారంగ్ (పంజాబ్) - 710 మార్కులు
- కృష్ణ ఎస్ఆర్ (కర్ణాటక) - 710 మార్కులు
- జీల్ విపుల్ వ్యాస్ (గుజరాత్) - 710 మార్కులు
- హాజిక్ పర్వీజ్ లోన్ (జమ్మూకశ్మీర్) - 710 మార్కులు
ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి..
ఈ ఏడాది జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. ఆగస్టు 31న ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేసిన చిత్రాలు వెబ్‌సైటులో అప్‌లోడ్ చేశారు. అభ్యర్థుల నుంచి ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత NEET UG - 2022 ఫలితాలను సెప్టెంబరు 7న విడుదల చేయనుంది.
కటాఫ్ మార్కులు ఇలా..?
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గతేడాది కటాఫ్ మార్కులు జనరల్-138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అప్‌లోడ్ చేయనుంది.
నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..